BRS Party News :   కేసీఆర్ ఏం చేసినా దానికో లెక్క ఉంటది! దానికో సమీకరణం ఉంటుంది! తనకు పాలిటిక్స్ అంటే టాస్క్‌ అంటారు కానీ అది ఆయన దృష్టిలో గేమ్! నిత్యం ఆడే చదరంగం! ఎత్తులు, పైఎత్తులు ఒకపట్టాన ఎవరికీ అర్ధంకావు! జనానికి అంతగా తెలియని వ్యక్తిని సడెన్‌గా తెరమీదికి తీసుకొచ్చి అందలమెక్కిస్తారు! అందరికీ సుపరిచతమైన వ్యక్తిని తెరమరుగు చేస్తారు! అదీ కేసీఆర్ మార్క్‌ రాజకీయం! అలాంటి గేమ్‌కి మరో ఉదాహరణ పాడి కౌశిక్ రెడ్డి! బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మండలిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని హుజురాబాద్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జి గా నియమించారు. ఈ మేరకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.


ఈటల రాజేందర్‌ను వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలనే ఎత్తుగడలో భాగంగానే కేసీర్ యాక్షన్ ఫ్లాన్‌ రెడీ చేశారు. అందులో భాగంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు. హుజురాబాద్ నియోజవర్గ ఇంఛార్జ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు అక్కడ ఇంఛార్జ్‌గా ఉన్న గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ని తప్పించి, పాడి కౌశిక్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు.

చెప్పాలంటే, ఈటల బర్తరఫ్‌ ఎపిసోడ్ తర్వాత హుజూరాబాద్ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారిపోయింది! రాజేందర్‌ ఎగ్జిట్ అయిన రెండు నెలల తర్వాత పాడి కౌశిక్ రెడ్డి తెరమీదికి వచ్చారు. గత ఎన్నికల్లో ఈటలకు గట్టి పోటీని ఇచ్చిన కౌశిక్‌ రెడ్డికి కేసీఆర్ గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక  కౌశిక్ రెడ్డి తిరుగుబాటు జెండా ఎగరేయడంతో.. ఆ పరిణామాన్ని కేసీఆర్ అడ్వాంటేజ్‌గా తీసుకున్నారు. 2021 మే నెలలో ఈటల బయటకి వెళ్లడం.. జూలైలో కౌశిక్ రెడ్డి పార్టీలోకి రావడం చకచకా జరిగిపోయాయి. వచ్చే ఉప ఎన్నికలో తనకే టికెట్ ఇస్తారని కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలో ప్రచారం చేసుకున్నారు. కానీ అప్పటి రాజకీయ పరిణామాలు, ఈటల సానుభూతి పవనాలు, బీసీ ఫ్యాక్టర్‌… వెరసి కౌశిక్ రెడ్డికి బీ-ఫామ్ రాలేదు. పార్టీలో మొదట్నుంచీ విద్యార్ధి నేతగా ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కి కేసీఆర్ టికెట్ కన్ఫామ్ చేశారు. ఆ ఉప ఎన్నికలో కేసీఆర్ చతురంగ బలాలు మోహరించినా, తన శక్తియుక్తులన్నీ కేంద్రీకరించినా, ఈటలను సానుభూతి పవనాలు గెలిపించాయి.


ఇదిలా వుంటే కౌశిక్ రెడ్డి నారాజ్‌ కాకుండా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కేసీఆర్ అప్పటికే ప్రామిస్‌ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం గవర్నర్ కోటాలో నామినేట్ చేశారు. కానీ, గవర్నర్‌  తమిళిసై ఆ ఫైల్‌ని రిజెక్ట్ చేయడంతో, తిరిగి ఎమ్మెల్యే కోటాలో మండలికి ఎన్నిక చేశారు కేసీఆర్. అంతటితో ఆగకుండా ఆయన్ని మండలిలో విప్‌గా నియమించారు. అప్పటి నుంచి కౌశిక్‌ రెడ్డి దూకుడు పెంచారు. ఈటెల రాజేందర్‌కు ఎప్పటికప్పుడు కౌంటర్లు వేస్తూ వచ్చారు. నిత్యం ప్రెస్ మీట్ పెట్టి రాజేందర్‌పై ఎటాక్ చేశారు. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఈట‌ల చేసింది ఏంటని చాలాసార్లు సవాల్ విసిరారు. ఈ దూకుడు స్వభావం కేసీఆర్‌కు నచ్చింది! ఈ విషయంలో గెల్లు వీక్‌ అనే చెప్పాలి!


ఈ లెక్కలన్నీ వేసుకున్న కేసీఆర్.. ఇటీవలే హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జుగా ఉన్న గెల్లుని ఆ బాధ్యతల నుంచి తప్పించి టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు. ఆ స్థానంలో పాడి కౌశిక్‌ రెడ్డికి తిరిగి బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయం వెనక కేసీఆర్ బలమైన సందేశాన్నే పంపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  హుజురాబాద్ గడ్డమీద గులాబీ జెండా ఎగరేయాలనే సంకేతాన్ని పార్టీ శ్రేణులకు పంపించారు. ఈటలను ఢీ కొట్టడం ఒక్క కౌశిక్ రెడ్డి వల్లనే అవుతుందనేది కేసీఆర్ గట్టి నమ్మకం. అందుకే ఆయనకు పార్టీలో ప్రియారిటీ పెంచారు. ఎమ్మెల్సీని చేయడం.. వెనువెంటనే విప్‌గా నియమించడం.. అడ్డంగా ఉన్న గెల్లుని తీసి టూరిజంలో వేయడం.. కౌశిక్‌ రెడ్డికి యోజవర్గ బాధ్యతలు అప్పగించడం.. ఇదంతా చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి టికెట్‌కు లైన్‌ క్లియర్ అయినట్టేననే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఈ పరిణామక్రమంలో హుజూరాబాద్‌ గులాబీ వశమవుతుందా..  లేక కేసీఆర్ వ్యూహం బెడిసికొడుతుందా! ఏం జరగబోతోందో వచ్చే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే!