KCR Daughter Kavitha: సీఎం కేసీఆర్ (CM KCR) పై కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే (Ashwini Kumar Choubey) సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో ఉన్న చౌబే.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. కేసీఆర్ సర్కార్ లిక్కర్ స్కామ్, అవినీత మీద పడిందని అన్నారు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(CM Kejriwal)తో కలిసి సీఎం కేసీఆర్ ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ తన 9 ఏళ్ల పాలనలో తెలంగాణను నరకప్రాయంగా మార్చారని మండిపడ్డారు.
కవితను ఎవరూ కాపాడలేరు
సీఎం కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్‌కు పాల్పడ్డారని, రేపో మాపో ఆమెకు శిక్ష పడడం ఖాయమని, జైలుకు వెళ్లక తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత జైలుకు వెళ్లడాన్ని ఎవరూ ఆపలేరని, ఆమెను ఎవరూ కాపాడలేరని అన్నారు. రాష్ట్రంలో చీకటి రోజులు పోయే రోజులు దగ్గరపడ్డాయని, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, దానిని కచ్చింగా నెరవేరుస్తారని చెప్పారు.
మద్యానికి బానిసలుగా చేస్తున్నారు
గోవా ఎన్నికల్లో కేజ్రీవాల్ 100 కోట్ల అవకతవకలకు పాల్పడ్డారని అశ్విన్ కుమార్ చౌబే ఆరోపించారు. మిషన్ భగీరథ పథకంలో కూడా కమీషన్లు తీసుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 24 గంటలు నీళ్లు వస్తాయని కేసీఆర్ చెప్పారని కానీ 4 గంటలు కూడా రావడం లేదన్నారు. భాగ్యనగరం హైదరాబాద్‌ను శరాబ్ నగర్‌గా చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మద్యానికి బానిసలుగా తయారుచేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణిని కూడా బీఆర్ఎస్ సర్కారు నాశనం చేసిందన్నారు.
ధరణి రద్దు చేస్తాం
దళితులకు దళిత బంధు ఇస్తామని బీఆర్ఎస్ మోసం చేసిందని చౌబే విమర్శించారు. కల్యాణ లక్ష్మీ, డబుల్ బెడ్రూం ఇండ్ల హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రతి స్కీమ్‌లో 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్ ద్వారా భూములు లాక్కుంటున్నారని, ధరణి పోర్టల్ కాదని, ధరణిని దోచుకునే పోర్టల్ అంటూ విమర్శలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని ప్రకటించారు. భూముల సర్వే చేసి అనంతరం డిజిటలైజేషన్ చేస్తామన్నారు.
విశ్వంలోనే అత్యంత అవినీతి పార్టీ కాంగ్రెస్
తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని, విశ్వంలోనే అత్యంత అవినీతి పార్టీ కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ.. అమర్, అక్బర్, అంథోనిలా మారతారని విమర్శించారు. అవసరానికి తగినట్లుగా రాహుల్ రూపం మార్చుకుంటారని ఎద్దేవా చేశారు. అవినీతిపరులు, కమీషన్లు తీసుకునేవారిని, దేశాన్ని దోచుకునే వారిని రాహుల్ కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ బీఆర్ఎస్ సర్కార్ వెనుకున్నది కాంగ్రెస్ కాదా? అంటూ ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు యత్నం
తెలంగాణలో బీఆర్ఎస్‌కు సీ టీం కాంగ్రెస్ అని అశ్విన్ కుమార్ చౌబే విమర్శించారు. అవినీతిపరులతో I.N.D.I.A కూటమి ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ బిల్లా - రంగా లాగా మారాయని ఎద్దేవా చేశారు. దేశంలో అవినీతి చేసిన వారిని వదిలేది లేదని, జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు.