BRS Khammam Meeting: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీగా మారిన తర్వాత నిర్వహిస్తున్న తొలి సభ ఈ నెల 18న ఖమ్మంలో జరగనుంది. ఈ బహిరంగ సభను హిట్ చేయాలని భావిస్తున్న సీఎం కేసీఆర్‌ (CM KCR).. అందుకు సంబంధించిన ఏర్పాట్లు, వ్యూహాలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో చర్చించారు. సభపై దేశవ్యాప్తంగా ఫోకస్ పడేందుకు కొన్ని రాష్ట్రాల సీఎంలను కూడా కేసీఆర్ ఆహ్వానిస్తున్నట్లుగా తెలిసింది. అందులో భాగంగా ముగ్గురు సీఎంలు, ఓ మాజీ సీఎంను సభకు పిలుస్తున్నట్లుగా సమాచారం. 


ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సింగ్, కేరళ సీఎం పినరయి విజయన్‌, యూపీ మాజీ సీఎం, సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఖమ్మం సభకు హాజరుకానున్నట్లు సమీక్షలో చెప్పుకున్నట్లు తెలిసింది. వీరు ముందుగా ప్రగతి భవన్‌కు చేరుకుంటారని, కేసీఆర్‌తో చర్చల అనంతరం ఆయనతో పాటే హెలికాప్టర్‌లో ఖమ్మం చేరుకోనున్నట్లు తెలుస్తోంది. సభా వేదికపై రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని అతిథులుగా హాజరయ్యే ముగ్గురు సీఎంలలో ఒకరితో ప్రారంభించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.


సీఎంతో భేటీలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, తాతా మధుసూదన్, విప్‌ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్, బానోతు హరిప్రియ, వనమా వెంకటేశ్వరరావు, జెడ్పీ చైర్‌పర్సన్‌ లింగాల కమల్‌ రాజ్‌ వంటివారు పాల్గొన్నారు.


జనాన్ని బాగా రప్పించాలని ఆదేశాలు


ఖమ్మం బీఆర్ఎస్ తొలి సభకు కో ఆర్డినేటర్‌గా మంత్రి హరీశ్‌ రావుకు బాధ్యతలు అప్పగించారు. భారీగా జనాల్ని సభకు రప్పించడం, సభా వేదిక ఏర్పాట్ల బాధ్యతను బీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, మరికొందరు ముఖ్య నేతలకు అప్పజెప్పినట్లుగా తెలుస్తోంది. సభకు తెలంగాణతో పాటు ఏపీలోని సమీప గ్రామాల నుంచి కూడా భారీగా జన సమీకరణ చేయాలనే యోచనలో కూడా సీఎం ఉన్నట్లు తెలిసింది.


ఉమ్మడి ఖమ్మం (Khammam District) జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు పొరుగునే ఉన్న సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్‌ జిల్లాల్లోని పది నియోజకవర్గాలు కలిపి.. మొత్తంగా 20 నియోజకవర్గాల నుంచి ఐదు లక్షల మందిని సభకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం లక్ష్యం విధించారు. సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలు, మహబూబాబాద్, పాలకుర్తి, డోర్నకల్, ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, ఇల్లందు, సత్తుపల్లి నియోజకవర్గాల నుంచి 40 వేల మంది చొప్పున జన సమీకరణ చేయాలని సీఎం సూచించినట్లుగా సమాచారం. 


అందుకోసం రూట్‌ మ్యాప్, పార్కింగ్, ఎన్ని వాహనాలు అవసరం? ఆ ప్రాంతంలో ఎన్ని వాహనాలు అందుబాటులో ఉన్నాయి, ట్రాఫిక్‌ జామ్‌, మళ్లింపు వంటి అంశాలపైనా నేతలు మాట్లాడుకున్నారు.