నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా పని చేసేందుకు మరో నందమూరి కుటుంబ సభ్యుడు ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ మనవడు, నందమూరి మోహనకృష్ణ తనయుడు, హీరో తారక రత్న (Nandamuri Taraka Ratna) కొన్ని రోజులుగా రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పావులు కదుపుతున్నారు.
లోకేష్‌ను కలిసిన తారకరత్న
Taraka Ratna Met Nara Lokesh : ఈ రోజు ఉదయం నారా లోకేష్‌ను ఆయన నివాసంలో తారక రత్న కలిశారు. కాసేపు ఏకాంతంగా చర్చలు జరిగాయి. ఇద్దరి మధ్య రాజకీయంగానే కాకుండా కుటుంబ పరంగా బంధుత్వం ఉంది. ఇటు కుటుంబ, అటు రాజకీయ విషయాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.
టికెట్ విషయం ఖరారు చేశారా?
రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు కొన్ని రోజుల క్రితం తారక రత్న వెల్లడించారు. ఈ రోజు లోకేష్ భేటీలో మరోసారి ఆ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్యే టికెట్ విషయంపై మాటా మంతీ జరిగాయట. తారక రత్నకు ఏ నియోజవర్గం నుంచి టికెట్ కేటాయిస్తారు? ఆయనకు ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఉంది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
నందమూరి, నారా కుటుంబాలు ఒక్కటే
నందమూరి, నారా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేలా ఇటీవల కొంత మంది వ్యాఖ్యలు చేస్తున్నారు. వరుస విమర్శలతో దూకుడు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీకి తారక రత్న తన సంపూర్ణ మద్దతు తెలిపారు.
Also Read : '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే?
ఏపీలో ప్రభుత్వం మారాలి
కొన్ని రోజుల క్రితం గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో నందమూరి తారకరత్న పాల్గొన్నారు. అప్పుడు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. రాష్ట్రాభివృద్ధికి, ప్రజలకు మేలు జరగడానికి ప్రభుత్వం మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ విగ్రహా విష్కరణలో నందమూరి తారకరత్న మాట్లాడుతూ... ''1982లో కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో ఆ మహానుభావుడు వేసిన తెలుగుదేశం అనే పునాది ఆ రోజు పేద ప్రజానీకానికి అతి పెద్ద భవంతిగా మారిందన్నారు. ఈరోజు సంకీర్ణ ప్రభుత్వాలు మన దేశాన్ని పాలించే విధానానికి నాంది పలికింది ఎన్టీఆర్. నేడు మన దేశాన్ని పాలించేది ఎన్టీఆర్ ఆలోచన, ఎన్టీఆర్ సృజన. ఆయన కలలు కన్న ఆంధ్ర రాష్ట్రం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది'' అని చెప్పారు.
Also Read : 'అన్‌స్టాపబుల్ 2'లో వీర లెవల్ మాస్ ఎపిసోడ్ లోడింగ్ - ఫిక్స్ అయిపోండి, సంక్రాంతికి రీసౌండ్
మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, మళ్ళీ మన భావి తరాలవారు సంతోషంగా బతకాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ప్రజలకు తారకరత్న పిలుపు ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రామన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకురావడం సాధ్యమన్నారు. ఎన్టీఆర్ మనవడిగా, మా బాలయ్య బాబుకు అబ్బాయిగా, చంద్రబాబు నాయుడుకు మేనల్లుడుగా, మీ అందరి బిడ్డగా మీ ఆశీర్వదాలే తనకు శ్రీరామరక్ష అన్నారు. చివరగా ఆయనకు అడ్డొస్తే సూర్యుడు, అభిమానిస్తే చంద్రుడైనా అంతా మా బాబాయ్ బాలయ్య బాబే అని తారకరత్న అన్నారు. బాలయ్య బాబాయ్ సైన్యాధ్యక్షుడు అయితే మనమంతా సైనికుల్లా పని చేయాలని అభిమానులకు, తెలుగు దేశం కార్యకర్తలకు ఆయన పిలుపు ఇచ్చారు.