BRS President KCR Speech : ఎన్నికల్లో గెలవాల్సింది రాజకీయ పార్టీలు కాదని.. ప్రజలని భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో పార్టీ పేరు మార్పు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత కేసీఆర్ మాట్లాడారు.దేశ  పరివర్తన కోసం ఏర్పాటైందే బీఆర్ఎస్ పార్టీ అని..  ఎవరో ఒకరు చైతన్య దీపం వెలిగించకపోతే ఈ దేశంలో కారు చీకట్లు కొనసాగుతునే ఉంటయి... ఈ చీకట్లో వెలిగించిన చిరుదీపమే బీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ ప్రకటించారు. 


నూతన జాతీయ విధానాల అవసరం


ఇన్నాళ్ళు పాలించిన కేంద్ర పాలకుల వైఫల్యాలను సరిదిద్దుతూ,  ఈ దేశ సమగ్రాభివృద్ధికి, అనేక రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించడం కోసం జాతీయ విధానాలు రూపొందించాల్సిన అవసరముందని సీఎం అన్నారు.  వ్యవసాయాధారిత భారతదేశంలో వ్యవసాయరంగం రోజురోజుకీ నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ దేశానికి నూతన వ్యవసాయ విధానం  అవసరముందన్నారు.  అదనపు నీటి వనరులున్నా నీటి కోసం యుద్ధాలు జరగడం శోచనీయమన్నారు.  చెన్నై లాంటి మహానగరానికి బకెట్ నీళ్ళు దొరకని దుస్థితి ఏమిటి? ఇదే సమస్య పై బాలచందర్ లాంటి దర్శకుడు తన్నీర్ తన్నీర్ అనే సినిమా తీస్తే ఆ నీటి బాధకు ప్రజలు దాన్ని సూపర్ హిట్ చేశారన్నారు.  ఇటువంటి అసంబద్ధ విధానాలను సరిచేయాల్సి ఉన్నది. కావేరీ నదీ జలాల కోసం తమిళనాడు, కర్నాటక వంటి సహచర రాష్ట్రాలు చేస్తున్న యుద్ధాలను చక్కదిద్దాల్సి ఉన్నదని కేసీఆర్ ప్రకటించారు.  దిక్కుమాలిన ట్రిబ్యునల్స్ పేరుతో నీటి యుద్ధాలను కొనసాగిస్తున్నారని.. వీటిని సరి చేయడానికి  ఈ దేశానికి నూతన జలవనరుల పాలసీ  కావాలని కేసీఆర్ స్పష్టం చేశారు. 


పల్లె పల్లెకు నిరంతర విద్యుత్ 
 
ఈ దేశంలో లక్షలాది మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసుకునే ప్రకృతి వనరులున్నాయని..  అయినా పల్లె పల్లెకూ విద్యుత్ అందించుకోలేక పోవడాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందని కేీఆర్ స్పష్టం చేశారు.  అందుకు నూతన విద్యుత్ పాలసీ కావాల్సి ఉందన్నారు. ఆర్థికంగా ఉజ్వలమైన స్థాయికి చేరుకునే అవకాశం ఉన్నా ఫారిన్ ఎక్సేంజీ నిల్వలు ఎందుకు తరిగిపోతున్నాయని ప్రశ్నించారు. డాలర్ ముందు మన రూపాయి విలువ ఎందుకు వెలవెలబోతున్నదని ప్రశ్నించారు.  అందుకోసం నూతన ఆర్ధిక విధానం  కావాల్సి ఉందన్నారు.  తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో నూతన పర్యావరణ పాలసీ  తెస్తామన్నారు.  


బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నూతన విధానం


  ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో సమన్యాయం, సామాజిక న్యాయం ఇంకా జరగడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా వర్గాలకు అభివృద్ధి ఫలాలను ఈ దేశ పాలకులు అందించలేకపోతున్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం తెలంగాణ అమలు చేస్తున్న పథకాల స్ఫూర్తితో ఈ దేశంలో  బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నూతన విధానం  తేవాల్సిన అవసరం ఉన్నదని కేసీఆర్ ప్రకటించారు.  దేశ జనాభాలో 50శాతం ఉన్న మహిళలను అనేకరకాలుగా వివక్షకు గురిచేస్తూ, దేశ అభివృద్ధిని కుంటు పడేలా చేస్తున్న విధానాలను సమీక్షించుకోవాల్సి ఉన్నది.  దేశ ప్రగతిలో మహిళలను మరింత భాగస్వాములను చేసే దిశగా మహిళా సాధికారత విధానం తేవాల్సి ఉందన్నారు.  అంతే కాకుండా, విద్య, వైద్యం తదితర మౌలిక వసతుల అభివృద్ధి పరచడానికి ఆయా రంగాల్లో తెలంగాణ స్ఫూర్తితో వినూత్నమైన ప్రగతికాముక విధానాలను రూపొందించి బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తుందని  ప్రకటించారు. 


విధివిధానాల రూపకల్పన కోసం మాజీ జడ్జీలు ప్రముఖ ఆర్థిక, సామాజిక వేత్తలతో, మేధావులతో కసరత్తు  


  భారత ప్రజలు అవకాశమిస్తే  మారుమూల గ్రామాలకు సైతం 24 గంటల పాటు కరెంటును,  సంవత్సరానికి 25 లక్షల కుటుంబాలకు దళితబంధు అందించగలమన్నారు.   వాస్తవాలను ప్రజల్లోకి తీసుకుపోగలిగనం కాబట్టీ తెలంగాణను సాధించుకోగలిగినం. అత్యద్భుతంగా అభివృద్ధి చేసుకోగలిగినం. అదే స్ఫూర్తితో ఈ వాస్తవాలన్నింటిని దేశ ప్రజల ముందుకు తీసుకుపోయి అర్థం చేయించగలిగినప్పుడు ఢిల్లీ ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఆటంకాలను ఎదుర్కొంటూ, అవమానాలను భరిస్తూ ముందుకు సాగుతూ  ఎక్కడ మంచి కోసం విప్లవాత్మక కార్యాచరణకు బీజాలు పడతాయో అక్కడ తప్పకుండా విజయం సాధ్యమవుతుంది అనేది చరిత్ర నిరూపించిన సత్యమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 


కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మద్దతు 
 
రాబోయే కర్నాటక ఎన్నికల్లో మనం జెడిఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతునిస్తూ ప్రచారంలో పాల్గొంటామని కేసీఆర్ ప్రకటించారు.  మన రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్నాటక ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని, జెడిఎస్ పార్టీని గెలిపించి కుమారస్వామిని మరోసారి ముఖ్యమంత్రిని చేద్దామన్నారు.  అందుకు తెలంగాణలో అమలవుతున్న విద్యుత్, వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం తదితర పథకాలను వారికి వివరిద్దామని పార్టీ నేతలకు సూచించారు.   డిసెంబర్ 14వ తేదీన ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించుకుందాం. అదే రోజు బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. పార్టీ ముఖ్యులంతా 13వ తేదీ సాయంత్రానికి ఢిల్లీ చేరుకోవాలి. మరో రెండు మూడు నెలల్లో మన సొంత బిఆర్ఎస్ భవనం పూర్తవుతుంది. అక్కడి నుంచే పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభిస్తామని కేీసఆర్ ప్రకటించారు.