Kavitha Lawyer :  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ ఎదుట హాజరు కావాల్సి  ఉన్న కవిత ఇవాళ హాజరు కాబోరని ఆమె తరపు లాయర్ సోమా భరత్ స్పష్టం చేశారు. కవిత  ఈడీ అధికారులకు రాసిన లేఖను ఈడీ కార్యాలంయలో  ఇచ్చిన తర్వాత ఆయన మడియాతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కవిత  గురువారం ఈడీ విచారణకు హాజరు  కాబోవడం లేదని ఆయన ప్రకటించారు.   కవితపై కేంద్రం కక్షగట్టి తప్పుడు కేసులు పెట్టించి ..  ఇబ్బంది పెట్టాలని చూస్తోందని కవిత తరపు లాయర్ భరత్ ఆరోపించారు.  మహిళల్ని ఇంటి దగ్గరే విచారించాలన్న నిబంధన పాటించడం లేదు కాబట్టే హాజరు కావడం లేదన్నారు. అనారోగ్యం కారణంగా హాజరు కావడం లేదని జరుగుతున్న ప్రచారం కరెక్ట్ కాదని కవిత లాయర్ స్పష్టం చేశారు. ఈడీకి కొన్ని డాక్యుమెంట్లను కూడా ఇచ్చామన్నారు. 
                           


 


ఈడీకి లాయర్ ద్వారా కవిత పంపిన లేఖలో ప్రధానంగా ఐదు అంశాలను ప్రస్తావించారు. తన ప్రాథమిక  హక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. సుప్రీం కోర్టులో విచారణ తర్వాతే ఈడీ ఎదుట హాజరవుతానని లేఖలో తెలిపారు. తన ఫోన్ సీజ్ చేసినట్లుగా సమన్లలో ప్రస్తావించలేదన్నారు. వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా సమన్లలో లేదని.. అందుకే లాయర్‌తో డాక్యుమెంట్లను పంపానని  లేఖలో కవిత పేర్కొన్నారు. ఇవే విషయాలను మీడియాకు వెల్లడించిన కవిత లాయర్ భరత్.. సుప్రీంకోర్టు విచారణ తర్వాతనే విచారణకు సహకరిస్తామన్నారు. 





మహిళా రిజర్వేషన్లపై ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం కోసం కవిత రెండు రోజుల కిందటే ఢిల్లీకి వచ్చారు. ఈ కారణంగా గురువారం ఆమె ఈడీ విచారణకు హాజరవుతారని అనుకున్నారు.  ఉదయం పదకొండు గంటలకు ఆమె హాజరు కావాల్సి  ఉంది. ఆ సమయంలో మీడియా సమావేశం ఉంటుందని  సమాచారం ఇచ్చారు. అందుకే ఆలస్యంగా  వెళ్తారని అనుకున్నారు  అయితే మీడియా సమావేశం పెట్టలేదు. కానీ పదకొండు గంటలకు కవిత లాయర్ ఓ లేఖను తీసుకుని ఈడీ కార్యాలయానికి వెళ్లారు.    



ఈడీ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఇంటి దగ్గరే ప్రశ్నించాలనే నిబంధనలు ఉన్నా పట్టించుకోవడం లేదని.. ఆరోపిస్తూ కవిత సుప్రీంకోర్టులో  బుధవారం పటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణను 24వ తేదీన చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.   కవిత విచారణకు సహకరించడం లేదన్న అభిప్రాయానికి ఈడీ వస్తే ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తాజా పరిణామాల ద్వారా అంచనా వేస్తున్నారు. విచారణకు  హాజరైన తర్వాత అయినా ఆమెను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే .. ఈడీ విచారణ కోసం ఢిల్లీకి వచ్చి..ఢిల్లీలోనే ఉన్న కవిత చివరి క్షణంలో   హాజరు కావడానికి వెనుకడుగు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది కీలకంగా మారింది.