Peddpally News: ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు చాలా ఎక్కువయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు మృత్యువాత పడుతూనే ఉన్నారు. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండి నిలబడి ఉన్నచోటే ప్రాణాలు విడుస్తున్నారు. జిమ్ లో కసరత్తులు చేస్తూ, నడుస్తూ రోడ్డుపై వెళ్తూ... ఎక్కడి వాళ్లు అక్కడే కుప్పకాలుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరోటి వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే..?
తెలంగాణలోని పెద్దపల్లి గోదావరిఖనికి చెందిన 47 ఏళ్ల బిల్డర్ ఠాకూర్ శైలేందర్ సింగ్ గుండెపోటుతో మృతి చెందారు. ఇందుకు సంబంధించిన విజ్యువల్స్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ముందుగా ఆయన తన ఇంటి తలుపులు మూసి, లిఫ్టు వద్ద వేచి చూస్తూ కుప్పకూలినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. ఇప్పుడు ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. గోదావరిఖనిలోని ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న శైలేందర్ సింగ్.. వేములవాడలోని తన సోదరుడి వద్దకు వెళ్లేందుకు బ్యాగ్ తో బయటకు వచ్చిన తన ఇంటికి తాళం వేశారు. ఛాతీ వద్ద రుద్దుకుంటూ ఆయన లిఫ్టు వద్దకు వెళ్లి బటన్ నొక్కారు. బ్యాగ్ పక్కన ఉంచి ఇబ్బందిగా బయటకు చూస్తూ నిలబడ్డారు. కొన్ని సెకన్లలోనే ఆయన వెనక్కి పడిపోయి మృతి చెందినట్లు సీసీ కెమెరాల్లో నమోదు అయింది. అయితే ఠాకూర్ శైలేందర్ డీసీసీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సోదరుడు.
నిన్నటికి నిన్న మరణాలపై స్పందించిన మంత్రి గంగుల
ఇటీవల తెలంగాణలో అతి చిన్న వయస్సు వారు గుండెపోటుతో మరణిస్తుండగా మంత్రి గంగుల కమలాకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో అటువంటి సంఘటనలు ఎక్కడా జరగకుండా జిల్లాలోని ప్రతి కళాశాలలో నిర్బంద వైద్యపరీక్షలను నిర్వహించడానికి చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గుంగుల కమలాకర్ తెలిపారు.
చిన్న వయసులో గుండెపోటు మరణాలపై స్పందించిన మంత్రి
శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, ఐఎంఏ అసోసియేషన్, ఫార్మసి అసోసియేషన్, వైద్యాదికారులు కార్టియాలజిస్టులతో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అతిచిన్న వయస్సువారు గుండెపోటుతో మరణిస్తున్నట్లు వస్తున్న వార్తలపై మంత్రి స్పందించారు. కరీంనగర్ జిల్లాలో ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవడానికి వీలు లేకుండా నగరాన్ని ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దేలా ఉచిత వైద్య శిబిరం, ఆరోగ్య పరీక్షల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని అన్ని కళాశాలల్లోని విద్యార్థులకు నిర్బంద గుండే సంబంధిత ఈసిజి, రక్తపరీక్ష మొదలగు వైద్యపరీక్షలను నిర్వహించెలా ప్రణాళికను రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ దిశగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, ఐఎంఏ, డయోగ్నోస్టిక్ నిర్వహాకులు వారి పూర్తి సహాకారాన్ని అందించాలని అన్నారు. వైద్యపరీక్షల నిర్వహాణలో కావాలసిన పూర్తి సహయ, సహాకారాన్ని అందిస్తానని మంత్రి తెలిపారు. అదేవిధంగా జిల్లాలో పోలీస్, మున్సిపల్ సిబ్బందికి సిపిఆర్ ద్వారా సహాయాన్ని ఎవిధంగా అందించాలో అవగాహాన కల్పించాలని సూచించారు.