Padi Koushik Reddy: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో (Huzurabad) బీఆర్ఎస్ (BRS) తరఫున పోటీ చేసి కచ్చితంగా పార్టీ జెండా ఎగురవేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అక్కడ పార్టీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించారని తెలిపారు. తెలంగాణ శాసన మండలి ప్రభుత్వ విప్ గా కౌశిక్ రెడ్డి శనివారం తమ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పట్నం మహేందర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండా శ్రీనివాస్ తదితరులు హాజరయి అభినందనలు తెలిపారు.


ఈ క్రమంలోనే పాడి కౌశిక్ రెడ్డి (Koushik Reddy) మాట్లాడుతూ.... తనకు విప్ గా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటానని చెప్పారు. తనకు సహకరించిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఇతర నేతలకు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కేటీఆర్ తన పేరును ప్రకటించారని, ఇప్పటి నుంచి పని చేయాలని ఆదేశించారని చెప్పారని అన్నారు. 



వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని కౌశిక్ రెడ్డి అన్నారు. 2024 ఎన్నికల్లో ఈటలను ఇంటికి పంపిస్తానని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. శాసన మండలి విప్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం కౌశిక్ రెడ్డి శనివారం రాత్రి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.


గతేడాది కాంగ్రెస్‌కు రాజీనామా, టీఆర్ఎస్‌లో చేరిక


నవంబర్ 2021లో జరిగిన తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి ఖరారైయ్యారు. ఆయన ఈ పదవిలో 1 డిసెంబర్ 2021 నుండి 30 నవంబర్ 2027 వరకు కొనసాగుతారు. కౌశిక్‌ రెడ్డి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్‌ చేతిలో ఓటమి పాల్యయారు. 12 జులై 2021న కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. 21 జులై 2021న హైదరాబాద్ లో కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. తర్వాత పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్‌ కోటా నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా రాష్ట్ర గవర్నర్ ఆమోదం కోసం 1 ఆగష్టు 2021న మంత్రివర్గం సిఫారసు చేసింది. కానీ, గవర్నర్ దానికి ఆమోదముద్ర వేయలేదు.


తెలంగాణ శాసన మండలికి 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో 16 నవంబర్ 2021న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారై, నవంబర్ 22న ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి ఎన్నికయ్యారు.