రామగుండంలో ప్రధాన మంత్రి మోదీ సాక్షిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఓ విషయంలలో క్లారిటీ ఇచ్చారు. రామగుండంలో RFCL ప్రారంభోత్సవం వేళ ఎన్టీపీసీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభావేదికగా సింగరేణి ప్రైవేటీకరణ ఆరోపణలపై మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. 


RFCL ప్రారంభోత్సవ సభలో మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి... తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తోందన్నారు. ఎన్నికల టైంలోనే రాజకీయాలు చేస్తామని... తర్వాత తాము అభివృద్ధి కోసమే పని చేస్తామన్నారు. అందులో భాగంగానే రూ. 6,338 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేశామని వివరించారు. రైతులకు మేలు చేసేలా పెట్టబడికి డబ్బులు ఇవ్వడమే కాకుండా... ప్రతి యూరియా బస్తాపై 1472 రూపాయాల సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. RFCL ప్రారంభంతో తెలంగాణలో యూరియా కొరత తీరబోతోందన్నారు. 


కొన్ని రోజులుగా టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సింగరేణి ప్రైవేటీకరిస్తారంటూ చాలా కాలం నుంచి కేసీఆర్‌తోపాటు ఇతర నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. సింగరేణిలోనూ దీనిపై విస్తృతంగా చర్చ నడుస్తోంది. అందుకే రామగుండంలోనే కిషన్‌రెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చారు. సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయబోయేది లేదన్నారు. దీనికి సంబంధించిన ఎక్కువ షేర్లు రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉన్నాయని గుర్తు చేశారు. దీనిపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 


రైతులకు కోసం ప్రధాని మోదీ తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు కిషన్ రెడ్డి. వరి, పత్తి మద్దతు ధర పెచామని వివరించారు. రామగుండానికి కేంద్రం ఈఎస్ఐ ఆసుపత్రి మంజూరు చేసిందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ కావడం లేదని విమర్శించారు. స్థలం సేకరించి చూపిస్తే వెంటనే నిర్మాణాలు ప్రారంభం అవుతాయన్నారు. దేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ఫ్లాంట్‌ను కూడా రామగుండంలో ఏర్పాటు చేసిన ఘనత బీజేపీకీ, మోదీకి దక్కుతుందని పేర్కొన్నారు. 


రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్స్​ లిమిటెడ్​ (ఆర్ఎఫ్సీఎల్​)ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. సభ ప్రారంభానికి ముందు ఎరువుల ఫ్యాక్టరీని పరిశీలించారు. ఆర్ఎఫ్సీఎల్ సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్టీపీసీ మహాత్మాగాంధీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభ ద్వారా ఆర్ఎఫ్సీఎల్‌ను ప్రారంభించారు. 


భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు రైల్వే లైన్‌ను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. మూడు జాతీయ రహదారుల విస్తరణకు కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన మోదీ... కేసీఆర్ పేరు ప్రస్తావించకుండానే విమర్సలు చేశారు. 


ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘రైతులు, సోదర, సోదరీమణులకు నమస్కారాలు. ఈ సభకు వచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు. రైల్వేలైన్‌, రోడ్ల విస్తరణతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కరోనాతో పాటు యుద్ధాల కారణంగా సంక్షోభం వచ్చింది. రెండున్నరేళ్లుగా ప్రపంచం సంక్షోభంలో ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ భారత్‌.. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ కాకపోవడంతో గతంలో ఈ కంపెనీ మూతపడింది. కొత్త ప్రాజెక్టులతో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇప్పుడు ఫెర్టిలైజర్‌ సెక్టార్‌ను చాలా అభివృద్ధి చేశాము. తక్కువ ధరకే నీమ్‌ కోటింగ్ యూరియా అందిస్తున్నాము.


గత 8 ఏళ్లలో దేశం రూపురేఖలు మారిపోయాయి. అభివృద్ధి పనుల మంజూరులో వేగం పెంచాము. సంక్షోభం సమయంలోనూ ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశాము. విపత్కర పరిస్థితుల్లోనూ సంస్కరణలు తెచ్చాము. నిరంతరం అభివృద్ధి కోసమే తపిస్తున్నాము. మేము శంకుస్థాపనలకే పరిమితం కాలేదు.. పనులు కూడా వేగంగా పూర్తి చేశాము. ఎరువుల కోసం గతంలో విదేశాలపై ఆధారపడేవాళ్లం. రైతులు లైన్లలో నిలబడేవారు. లాఠీదెబ్బలు తినేవారు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీతో ఎరువుల కొరత తీరుతుంది. భూసార పరీక్షలు చేసి రైతులకు కార్డులు ఇస్తున్నాము. నేల స్వభావాన్ని బట్టి పంటలు వేసుకునే చర్యలు చేపట్టాము. యూరియా బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టాము.  5 ఫ్యాక్టరీల్లో 70 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి అవుతోంది. పీఎం కిసాన్‌ కింద రైతులకు రూ.6వేలు అందిస్తున్నాము. రైతుల కోసం 10 లక్షల కోట్లు ఖర్చుచేశాము. వచ్చే రెండేళ్లలో రెండున్నర లక్షల కోట్లు ఖర్చు చేస్తాము. 


తెలంగాణ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తాము. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రశక్తే లేదు. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్రం వాటా కేవలం 49 శాతం మాత్రమే. ప్రైవేటీకరణ చేసే అధికారం కేంద్రానికి ఉండదు. మెజార్టీ వాటా రాష్ట్రానిదైతే కేంద్రం ఎలా విక్రయిస్తుంది?. బొగ్గు గనులపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి కొందరు రెచ్చగొడుతున్నారు. పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న వారికి ఈరోజు నిద్రకూడా పట్టదు’ అంటూ కామెంట్స్‌ చేశారు.