Karimnagar RTC News: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు చాలామంది హడావిడిలో తమ సామానులను మరచిపోతుంటారు. మరి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించింది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ మరింత పెరిగిపోయింది. 


ఇలా రద్దీ సమయంలో అసలు ప్రయాణించడమే కష్టమనుకుంటే లగేజ్‌తో వెళ్తే అంతే సంగతులు. ఇలా ప్రయాణించే చాలా మంది రద్దీలో దిగే టైంలో లగేజ్‌ మర్చిపోతుంటారు. హడావిడిలో తమ సామాన్లను బస్సులోనే వదిలేస్తుంటారు. అయితే అలా మర్చిపోయిన సామాన్లు ఆర్టీసీ అధికారులు ఏం చేస్తారు. దీనిపై ఆర్టీసీ అధికారులు ఏం చెబుతున్నారు. దాన్ని తిరిగి పొందవచ్చో కరీంనగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేశం ఏబీపీ దేశంతో మాట్లాడుతూ వివరాలు అందజేశారు. 


సమ్మక్క సారలమ్మ జాతర ప్రయాణాలు


ప్రస్తుతం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సీజన్ మొదలైంది. సమ్మక్క సారలమ్మను దర్శించుకునే ముందు వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఇలా వరంగల్ నుంచి వేములవాడకు వెళ్తున్న ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. తనతో పాటు ఒక కోడిపుంజు తెచ్చుకున్నారు. వరంగల్ నుంచి వేములవాడకు వెళ్లిన ఆ బస్సు ప్రయాణికులను అక్కడ దించి తిరిగి కరీంనగర్ డిపోకు చేరుకుంది. 


కోడిపుంజు మర్చిపోయిన వ్యక్తి


డిపోలో బస్సును ఆర్టీసీ సిబ్బంది శుభ్రం చేస్తున్న టైంలో బస్సులో కోడిపుంజును చూశారు. సిబ్బంది వెంటనే డిపో కంట్రోలర్‌కు సమాచారం అందించారు. దీంతో ఆ కోడిపుంజుని భద్రపరించారు. అడిగితే ప్రయాణికులకు అప్పగించేందుకు డిపోలో ఉంచారు. డిపోలో భద్రపరిచి ఉంచిన కోడిపుంజును మూడు రోజుల వరకు ఎదురు చూస్తారు. 


మూడు రోజుల్లో రాకపోతే వేలం


ఎవరైనా వస్తే వారి వివరాలు తీసుకొని దాన్ని ఇచ్చేద్దామనుకున్నారు. ఎవరు రాకపోతే వేలం వేస్తామని డిపో మేనేజర్ అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో పేలుడు పదార్థాలు, జంతువులను వెంట తీసుకెళ్లడం నేరమని చెబుతున్నారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో దొరికిన కోడిపుంజును తీసుకురావడం విచిత్రంగా ఉంది. మొత్తానికైతే కోడిపుంజుకు సంబంధించిన యజమాని ఆ కోడిని తీసుకెళ్తారా లేదా అనే విషయం అయితే చూడాలి.