KTR speech at Jammikunta Public Meeting: హుజూరాబాద్ లో నిధుల వరద పారిస్తామని ఉప ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్ అన్నారని, 14 నెలలు పూర్తయ్యాయని ఏం జరిగిందో చెప్పాలని తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ పాలన రాష్ట్రానికి అరిష్టమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల అన్నారని, ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా కేంద్ర మంత్రి అమిత్ షాను తీసుకొచ్చావా, నియోజకవర్గాన్ని ఎందుకు డెవలప్ చేయలేదో ప్రజలకు చెప్పాలన్నారు.


కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. 14 నెలల కిందట జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో నిధుల వరద పారిస్తా, కేంద్రాన్ని తీసుకొస్తానని చెప్పిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను మీరు గెలిపించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ త్వరలో వస్తోందని మాయ మాటలు చెప్పిన ఈటల హుజూరాబాద్‌ను మార్చేస్తాం అని చెప్పి ఇప్పటివరకూ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ.3వేల పెన్షన్‌ ఇవ్వడం లేదని, కానీ తాము ఇస్తామని ఈటల రాజేందర్ ఇక్కడి ప్రజలను మోసం చేశారన్నారు. నిధుల వరద పారిస్తానని ఈటల ఎన్నో మాటలు చెప్పారు కానీ, ఒక్క పైసా ఢిల్లీ నుంచి తెలంగాణకు గానీ, హుజూరాబాద్ కు గానీ వచ్చిందా? అని ప్రజలు ఆలోచించాలన్నారు కేటీఆర్. మాటలు దాటుతయ్‌.. చేతలు మాత్రం కడప దాటవు అని సెటైర్లు వేశారు. 


సీఎం కేసీఆర్ ను రాష్ట్రానికి పట్టిన అరిష్టమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేశారని, కానీ ఈటల అనే వ్యక్దిని హుజూరాబాద్ నియోగకవర్గ ప్రజలకు పరిచయం చేసింది కేసీఆర్ కాదా అన్నారు. ఎంతో మంది టికెట్ కోసం పోటీ పడ్డా, నమ్మి అవకాశం ఇచ్చింది ఈటలకు అని గుర్తుచేశారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా తండ్రి లాంటి కేసీఆర్ పై దారుణమైన వ్యాఖ్యలు చేయడం ఈటలకే చెల్లిందన్నారు. జన్ ధన్ ఖాతాలు తెరిస్తే ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని నరేంద్ర మోదీ అన్నారని, కానీ అధికారంలోకి వచ్చే తొమ్మిదేళ్లు పూర్తి కావొస్తున్నా ఒక్క రూపాయి వేయకుండా ప్రజలను మోసం చేయడం కేంద్ర ప్రభుత్వానికి అలవాటు అయిందన్నారు. నల్లధనం తీసుకువచ్చి ప్రజల ఖాతాల్లో వేయకుండా ఎవరి ఖాతాలో వేశారో చెప్పాలంటూ బీజేపీ నేతలను ప్రశ్నించారు.



ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లిస్తా. కరెంటు లేని ఊరు ఉండదు అన్నారు. ఇల్లు లేని పేదలు 2022 నాటికి ఉండరని ప్రధాని మోదీ చెప్పలేదా.. 2023 వచ్చింది దేశంలో అందరికీ సొంత ఇల్లు ఉందా అని బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారత్ లో జరుగుతున్న డెవలప్ మెంట్ చూసి అమెరికా వాళ్లే వీసాల కోసం లైన్ కట్టాలని చెప్పిన మాటలు ఎప్పుడు నిజం అవుతాయోనన్నారు. కొందరు నేతలు మోదీని దేవుడు అంటున్నారు. ఎవరికి దేవుడు, ఎందుకు దేవుడు అయ్యాడని ప్రశ్నించారు. సీట్లు ఇచ్చినందుకు మీకు దేవుడు అయి ఉండొచ్చు కానీ దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. రూ.400 ఉన్న ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.1200 చేసిన వ్యక్తికి ఎవరైనా దేవుడంటారా ? ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసినందుకు దేవుడయ్యాడా? అంటూ కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన సమయంలో పెట్రోల్ లీటర్ ధర రూ.70గా ఉండేదని, ఇప్పుడు రూ.110, రూ.120కి పెరగడం నిజం కాదా. అప్పట్లో క్రూడాయిల్ బ్యారెల్ 90 కాగా, ఇప్పుడు సైతం అదే ధర ఉండగా, పెట్రోల్ మాత్రం లీటర్ కు రూ.40 నుంచి రూ.50 ఎందుకు పెరిగిందో ప్రజలు ఆలోచించాలన్నారు.