కరీంనగర్ లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా గత నాలుగు రోజుల నుంచి ఎలాంటి ఘటనలు జరగకుండా పక్కా ప్రణాళికతో పోలీస్ యంత్రాంగమంతా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఎన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినప్పటికీ ఇటు హుజురాబాద్ నియోజకవర్గం, కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను, విద్యార్థి సంఘ నేతలను అరెస్టు చేశారు. అయినా మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకొని ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ కొంతమంది విద్యార్థులు పోలీసు వలయాన్ని ఛేదించుకొని వచ్చారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.


ఈటల రాజేందర్ ఇలాకా అయిన కమలాపూర్ లో మంత్రి కేటీఆర్ పర్యటన ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగింది. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయ్‌ ముందు నల్ల చొక్కాలతో నిరసన వ్యక్తం చేశారు. ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఓ జడ్పీటీసీ ఏబీవీపీ కార్యకర్తతో అనుచితంగా ప్రవర్తించారని స్థానికులు తెలిపారు. ముందస్తుగా పోలీసులు బీజేపీ నేతలను అరెస్టులు చేయడంపై హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ పర్యటనలో భాగంగా కమ్యూనిటీ కాంప్లెక్స్ వద్ద మంత్రి కేటీఆర్‌ను చేనేత కార్మికులు నిలదీశారు. తమ అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలని వారు ప్రశ్నించారు. దీనికి స్పందనగా పద్మశాలీల అభివృద్ధికి ఏం చేశారో మోదీని అడగాలని కేటీఆర్ బదులిచ్చారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. చేనేత కార్మికుల సమస్యలు తెలంగాణ ప్రభుత్వంలో దాదాపు పరిష్కరించాం. మహిళలు ఆర్థిక అభివృద్ధి కోసం పాటు పడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం చేశాము. త్వరలో చేనేత కార్మికుల కోసం కొత్త కార్యక్రమం చేయనున్నాం’’ అని కేటీఆర్ అన్నారు. 


హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్‌కు కేటీఆర్ హెలికాఫ్టర్‌లో చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా కమలాపూర్ మండలంలో రూ.49 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎమ్‌జేపీ బాలికల/బాలుర గురుకుల పాఠశాల పనులకు ప్రారంబోత్సవం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కేటీఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ సహా జిల్లా బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. కేటీఆర్ పర్యటనలో గౌడ సంఘాలు, మహిళా సంఘాలు, మహిళలు బోనాలతో మంత్రి కేటీఆర్ కు స్వాగతం పలికారు.