తెలంగాణలో పరీక్షలు ముగిసిన తర్వాత ఎగ్జామినేషన్ పేపర్లను దిద్దడానికి ఇప్పుడు టీచర్లు కరువయ్యారు. అనారోగ్య కారణాలు, ఇతర వ్యక్తిగత సమస్యలను చూపుతూ కరీంనగర్ జిల్లాలో పలువురు టీచర్లు జవాబు పత్రాలను దిద్దడానికి ముందుకు రావడం లేదు. దీంతో విద్యార్థిని, విద్యార్థుల ఫలితాల జాప్యంతో ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనబడుతున్నాయి. మరోవైపు విధులు నిర్వహిస్తున్న వారికి తలకు మించిన భారమవుతోంది. దీంతో సరిగ్గా దిద్దని పరిస్థితి ఎదురవుతోంది. ఇదే కనుక కంటిన్యూ అయితే మార్కుల విషయంలో  సమస్యలు ఎదురవుతాయని టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు. అయితే ఇలా డుమ్మా కొట్టిన టీచర్ల వివరాలు సేకరించి వారిపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.


కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సెయింట్ జాన్స్ స్కూల్ లో టెన్త్ పేపర్లకు సంబంధించి స్పాట్ వ్యాల్యుయేషన్ విధులకు కొందరు టీచర్లు డుమ్మా కొట్టారు. ఒక్క సోషల్ సబ్జెక్ట్ పేపర్ల కరెక్షన్ కోసం ఉమ్మడి జిల్లాలోని 24 మంది టీచర్లు విధులకు హాజరు కాకుండా పోవడంతో వారికి మెమోలు జారీ చేశారు. వీరంతా పలు రకాల కారణాలతో డ్యూటీ  రద్దు చేసుకున్నారు. వీరి స్థానంలో కొత్త వారిని నియమించడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నా కూడా సమయానికి మాత్రం అందుబాటులో సిబ్బంది దొరకడం లేదు. 11 మంది ఏఈలు, ముగ్గురు సీఈ ల అవసరం ఉండగా ప్రత్యేకంగా కేటాయించడానికి జిల్లా విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఇక స్పెషల్ అసిస్టెంట్ విధులు కొందరు టీచర్లకు కేటాయించగా వారు కూడా పెద్ద సంఖ్యలో హాజరు కాలేదు. 


హెచ్ఆర్ఏ పొందే ప్రాంతంలో పనిచేస్తూ స్పెషల్ అసిస్టెంట్ విధులకు డుమ్మా కొడుతున్న టీచర్లు తమపై ఎలాంటి చర్యలు తీసుకోలేరని, ఇలా ఆలోచిస్తున్నారా అని విద్యాశాఖ భావిస్తోంది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వారు ముఖ్యమైన విధులకు హాజరు కాకపోవడం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవడమేనని తెలుస్తోంది. కొద్ది మంది సిబ్బందితో అతి తక్కువ సమయంలో వేలాది ఆన్సర్ షీట్‌లను కరెక్షన్ చేయడం వల్ల ఎంతవరకు క్వాలిటీ అవుట్ పుట్ వస్తుంది అనే దానిపై గందరగోళం నెలకొంది. 


ప్రతి సంవత్సరం ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా ఎక్కువ సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవడం ద్వారా ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుందని విద్యా శాఖ నిపుణులు అంటున్నారు. వాస్తవానికి కొందరు టీచర్లు నిజమైన తప్పనిసరి పరిస్థితుల్లో, ముఖ్యమైన వ్యక్తిగత పనుల కారణంగా స్పాట్ వ్యాల్యుయేషన్ విధులకు హాజరుకాలేక పోతున్నారు. కానీ మిగతా టీచర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల, సరైన ఫలితాలు వెలువడక విద్యార్థుల జీవితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విద్యాశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 


Also Read: TTD Darshan Tickets: టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు TTD శుభవార్త - శ్రీవారి దర్శనానికిగానూ స్పెషల్ టికెట్లు జారీ