Telangana Palle Pragathi : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కారణంగా రాష్ట్రం ముందుకు సాగుతోందని, అలాంటి తమ పాలనపై బీజేపీ విషం చిమ్ముతోందని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ మండిపడ్డారు. పల్లె ప్రగతితో గ్రామాలు బాగుపడ్డాయని అందుకు పారదర్శక పాలనే కారణం అన్నారు. గతానికి భిన్నంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం పెరిగిందని, దీంతో రోగాలు మాయమైపోయాయని మంత్రులు అన్నారు.
పల్లెప్రగతిలో భాగంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్‌లో మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు మినీ స్టేడియాన్ని ప్రారంభించారు. ఊర్లలో నెలకొన్న సమస్యలను తాము పరిష్కరిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉండటం మన అదృష్టమన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో అమలుచేయని ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయంటే అందుకు కారణం కేసీఆర్ అని పేర్కొన్నారు. కేసీఆర్‌లాగ దేశంలో మరో సీఎం రైతుల అభివృద్ధికి పాటుపడటం లేదన్నారు. కావాలంటే తెలంగాణలో అమలవుతున్న పథకాలు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాష్ట్రంలో అమలవుతున్నాయో లేదో తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు.
పంచాయతీ సమస్యలపై కీలక వ్యాఖ్యలు
కేంద్రం నుంచి రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు రావాల్సి నిధులు బకాయిలు రావడం లేదన్నారు. కేంద్రం కనుక ఈ నిధులు ఇవ్వకపోతే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భరతం పడతామని హెచ్చరించారు. తెలంగాణపై కనీస అవగాహన లేకుండా కేంద్ర మంత్రి అమిత్‌షా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అంటే పెద్ద అబద్ధాల పార్టీ అని, కానీ తమది చేతల్లో చేసి చూపే సర్కార్ అని పేర్కొన్నారు. కేంద్రం బకాయిల విషయం తెలుసుకోకుండా బండి సంజయ్ అసత్యాలు ప్రచారం చేసి సర్పంచ్‌లను రెచ్చగొడుతున్నారని చెప్పారు.
తెలంగాణ అభివృద్ధి చూడలేకనే..
సీఎం కేసీఆర్ పాలనతో తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేంద్రం తమనై విషం చిమ్ముతున్నదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు, ప్రతి గ్రామంలో సమస్యలు ఉండేవని.. నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు, పంటల పెట్టుబడి, బీమా, కల్తీలేని విత్తనాలు రైతులకు అందేవి కావన్నారు. ఇప్పుడు వీటితో పాటు ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు. కోతలు లేకుండా 24 గంటలు కరెంటు ఇస్తున్నామని.. కేసీఆర్ పాలనకు ఇది నిదర్శనం అన్నారు. పల్లె ప్రగతితో గ్రామాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, కానీ బీజేపీ నేతలు తెలంగాణ ప్రగతిని చూడలేక విషం చిమ్ముతున్నారని మంత్రి గంగుల విమర్శించారు.