తెలంగాణ ఐటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సొంత నియోజకవర్గం సిరిసిల్లకు సరికొత్త రూపు రానుంది. పెరుగుతున్న జనాభా, భూ వినియోగం ,రోడ్డు రవాణా వ్యవస్థ ,నీటి వనరులు, వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్య రంగాలకు భూకేటాయింపులు లాంటి ఖచ్చితమైన ప్రణాళికలతో పూర్తిస్థాయిలో మాస్టర్ ప్లాన్ ని సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేటు సంస్థకు సర్వే బాధ్యతలను గతంలోనే అప్పగించారు. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ లో పూర్తి స్థాయిలో స్టడీ చేయడంతో ఇక ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు .


నిజానికి సిరిసిల్ల పురపాలక సంఘానికి 2003లో తయారుచేసిన మాస్టర్ ప్లాన్ ఇప్పటికీ వాడుకలో ఉంది. కానీ కొత్త జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత అనేక రకాలుగా సిరిసిల్ల పట్టణం విస్తరించింది. మరోవైపు భూములకు కూడా విపరీతంగా డిమాండ్ వచ్చింది. చుట్టుపక్కల గ్రామాలు కూడా దాదాపుగా సిరిసిల్లలో కలిసిపోవడంతో ల్యాండ్ కు సంబంధించి సేల్స్ అలాగే పర్మిషన్లకి సంబంధించి ఎలాంటి నిబంధనలు అనుసరించాలో తెలిసే పరిస్థితి లేదు. పోనీ అప్పటి ప్లాన్ ప్రకారం వెళ్దామంటే మారుతున్న అవసరాలకు అవి ఏమాత్రం పనికొచ్చేలా లేవు. మరోవైపు ప్రజల ఆహ్లాదం కోసం పార్కుస్థలం...అవసరాల కోసం ఇతర రహదారుల వెడల్పు లాంటి వాటికై  సమగ్ర సర్వే చేయడానికి 2018 లోనే ప్లాన్ వేశారు అధికారులు. మొదటి సమావేశం 2019లో జరుగగా తర్వాత ఏడు గ్రామాలు విలీనం కావడంతో ప్రణాళికను మరోసారి మార్చాల్సి వచ్చింది. ప్రస్తుతానికి పూర్తిస్థాయిలో విలీన గ్రామాల తో కలిపి సర్వే కి సంబంధించి అధ్యయనం పూర్తయింది.


   


కొత్త మాస్టర్ ప్లాన్ లో సిరిసిల్ల వేములవాడ అవుటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న స్థానాన్ని బోనాల ఉత్సవాల కోసం మార్చారు.  ఈ ప్రాంతం నివాస ప్రాంతంగా మారనుంది. ప్రధాన రహదారులకు ఇరువైపులా వున్న ప్రాంతాల్లో రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్ గా కలిపి అనుమతులు ఇకపై ఇవ్వనున్నారు. పట్టణ పరిధిలో మొత్తం మూడు చెరువులు ఉండగా వాటిలోనికి కి పైన ఉన్న పద్దెనిమిది చెరువుల నీరు వచ్చి చేరుతోంది. సిరిసిల్ల టౌన్ లోని చెరువుల నాలాలు పూర్తిగా ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో సిటీ మొత్తం వర్షాకాలంలో ముంపునకు గురవుతోంది .ఇప్పటినుండి నాలా పరిధిలో లే అవుట్లు, ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరు. సిరిసిల్ల లోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ,ఇటు రాజకీయంగా కౌన్సిలర్ల అభిప్రాయాలను సిద్ధం చేసి మాస్టర్ ప్లాన్ లో నమోదు చేయనున్నారు .


కౌన్సిల్ సమావేశంలో చర్చించిన తర్వాతే ఫైనల్ డ్రాఫ్ట్ ని పబ్లికేషన్ కోసం నెల రోజుల పాటు ప్రజల ముందు ఉంచనున్నారు. ప్రజల నుండి ఎలాంటి అభ్యంతరాలు వస్తాయో వాటికి సమాధానం ఇచ్చి పరిష్కారమార్గం చూపాకే చివరకి ఆమోదం లభించనుంది.సిరిసిల్ల పాత ప్రణాళిక ప్రకారం పట్టణ విస్తీర్ణం 15.27 చదరపు కిలోమీటర్లు జనాభా 75640.. ఇక కొత్త ప్రణాళిక ప్రకారం విస్తీర్ణం 55.47 చదరపు కిలోమీటర్ల వరకు పెరిగింది..జనాభా దాదాపు 1,20,000.  కొత్తగా ఏడు గ్రామాలు ఇందులో విలీనం కావడంతో అటు విస్తీర్ణం, ఇటు జనాభా గణనీయంగా పెరిగాయి.