Maoists in Telangana: ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతానికే పరిమితమైన మావోయిస్టులు ఇటీవల కాలంలో జరిగిన పలు సంఘటనలతో కలకలం సృష్టిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్న వెంకటాపురంలో కాల్పుల సంఘటన మరువక ముందే చర్ల మండలంలో ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఉప సర్పంచ్‌ను మట్టుబెట్టి పోలీసులకు సవాల్‌ విసిరారు. ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుండటం, మావోయిస్టు సానుభూతి పరులను గుర్తించి వారిని తిరిగి జన జీవన స్రవంతిలో కలిసేలా చేస్తుండటంతో ఇప్పటి వరకు మావోలు కదలికలు తగ్గుముఖం పట్టాయని అంతా బావించారు.


తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతంతోపాటు ఛత్తీస్‌గఢ్ సరిహద్దుగా ఉన్న చర్ల, వెంకటాపురం మండలాల్లో తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు కొత్తగా రిక్రూట్‌మెంట్‌ చేసుకునే పనిలో భాగంగా అడవిలో ఉన్న గ్రామాలపై దృష్టి సారించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే భద్రాద్రి జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించిన చర్ల మండలంలోనే... ఇన్‌ ఫార్మర్‌ అన్న నెపంతో ఓ ఉప సర్పంచ్‌ను హత్య చేయడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. 


మైదాన ప్రాంతంపై సైతం మావోల దృష్టి.. 
ఓ వైపు పోలీసులకు సవాలు విసురుతూనే మరోవైపు మైదాన ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగించేందుకు మావోలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గోదావరి పరివాహక ప్రాంతాన్ని తమ షెల్టర్‌ జోన్‌గా మార్చుకోవడంతోపాటు కొత్తగా రిక్రూట్‌మెంట్‌ చేసుకునే పనిలో పడినట్లు పోలీసులకు సమాచారం అందింది. చర్ల నుంచి మంచిర్యాల వరకు ఉన్న గోదావరి ప్రాంతంలో అత్యధికంగా అడువులు ఉన్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో అనువైన సమయంగా భావించి కార్యకలాపాలకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతానికే పరిమితమైన మావోయిస్టులను.. తెలంగాణలో కార్యకలాపాలు చేయకుండా నిలువరించేందుకు పోలీసులు వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. 


రూ.5 నుంచి 20 లక్షల వరకు రివార్డులు.. 
మైదాన ప్రాంతంలో కదలికలు పెంచిన మావోయిస్టులను గుర్తించిన పోలీసులు వారిపై రివార్డులతో ఉన్న పోస్టర్లను విడుదల చేశారు. గోదావరి పరివాహక ప్రాంతంలో మావోలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించిన వారికి రివార్డు ప్రకటిస్తామని తెలిపారు. పోలీసులు విడుదల చేసిన జాబితాలో చర్ల - శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ, భద్రాద్రి కొత్తగూడెం – అల్లూరి సీతారామరావు జిల్లాల డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఆజాద్‌ అలియాస్‌ కొయ్యాడ సాంబయ్య, మిలీషియా కమాండర్‌ బాబు అలియాస్‌ వెట్టి దేవా, చర్ల ప్లాటూన్‌ ఇన్‌చార్జ్‌ మధు అలియాస్‌ గజేందర్, ఏరియా కమిటీ మెంబర్‌ రాజేష్‌ అలియాస్‌ మడకం ఎర్రయ్య, సందీప్‌ అలియాస్‌ కోనయ్య, పద్దం నందయ్య అలియాస్‌ రామ్‌దా, రజిత అలియాస్‌ మడకం కోసిలు ఉన్నారు. వీరిపై రూ.20 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పోలీసులు రివార్డు ప్రకటించారు.


పోస్టర్ ను విడుదల చేసిన రోహిత్.. 
భద్రాచలం ఏసీపీ రోహిత్‌ రాజ్‌ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే మైదాన ప్రాంతంలో వీరి కదలికలు గుర్తించిన నేపథ్యంలోనే వీరిపై ఉన్న రివార్డుల పోస్టర్‌ను పోలీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలపై పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేయడంతో ఎలాంటి సంఘటనలు జరగకుండా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.