Karimnagar Crime: కరీంనగర్ జిల్లా కేంద్రంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. చుట్టూ రద్దీగా ఉన్నప్పటికీ సీసీ కెమెరాలలో తాము చేసే నేరం రికార్డ్ అవుతాయనే భయం ఉన్నప్పటికీ.. బైక్ పై స్పీడ్ గా వచ్చి ఓ వ్యక్తి దగ్గరనుంచి 15 లక్షల రూపాయలు లూటీ చేశారు. అటు దగ్గర్లోనే టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఉండడం.. కమిషనర్ ఆఫీస్ కూడా అతి సమీపంలోనే ఉన్నప్పటికీ వారి తెగింపు చూసి పోలీసులే ముక్కున వేలేసుకుంటున్నారు.
అసలు ఏం జరిగింది?
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముకరంపుర ప్రాంతంలో ఓ బ్యాంకుకి పనిమీద సాయివాణి ఆర్ఎంసీ ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు చంద్ర ప్రకాష్, బండ మల్లారెడ్డి తమ ఆఫీసు కార్యకలాపాలకు సంబంధించి డబ్బుల కోసం జిల్లా కలెక్టరేట్ లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) బ్రాంచ్ కి వచ్చారు. ఉదయం 11:15 ప్రాంతంలో రెండు చెక్కుల ద్వారా 15 లక్షల డ్రా చేసుకొని తమ బైక్ పై రిటర్న్ అయ్యారు. అయితే వారిని మొదటి నుండి గమనిస్తూ వస్తున్న ఇద్దరు అగంతకులు పక్కా ప్లానింగ్ తో పద్మనాయక రోడ్డులో ఓవర్టేక్ చేస్తూనే చంద్రప్రకాష్ చేతిలో ఉన్న డబ్బులకు సంబంధించి బ్యాగ్ ని లాక్కొని క్షణాల్లో మాయమయ్యారు. అయితే జరిగిందేంటో తెలుసుకుని తేరుకొని వారిని వెంబడించిన కూడా సమీప ప్రాంతాల్లో కనీసం జాడ కూడా దొరకలేదు. దీంతో చేసేదేమీ లేక టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


దొంగల తెగింపుపై పోలీసుల ఆశ్చర్యం
నిజానికి కరీంనగర్ పట్టణంలో అత్యంత రద్దీగా ఉంటుంది కలెక్టరేట్ ప్రాంతం. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో నిత్యం ఉద్యోగులతో కలెక్టరేట్ కి వివిధ పనులపై వచ్చే ప్రజలతో హడావుడిగా ఉంటుంది. ఇక్కడి నుండి దొంగతనం జరిగిన ప్రాంతం ఒక పావు కిలోమీటర్ దూరంలో ఉంది. మొదటి నుండి పకడ్బందీగా రెక్కివేసిన దొంగలు పద్మనాయక రోడ్డు ప్రాంతంలో దోపిడీకి దిగడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది గల్లి గల్లి లోను సిసిటీవీలు ఉన్న ఈ రోజుల్లో... అత్యధిక టెక్నాలజీ వాడి గతంలో గంటల్లోనే దొంగతనాలను ఛేదించిన హైటెక్ పోలీసింగ్ ఉన్న కరీంనగర్ పట్టణ కేంద్రంలో దొంగలు అంత ధైర్యంగా ఎలా వ్యవహరించారా ? అనే దానిపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికంగా ప్రతి రూట్ తెలిసిన వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇక ఖచ్చితంగా పెద్ద మొత్తంలో డబ్బు ఆ బ్యాగ్ లో ఉంటుందని బ్యాంకులోకి వెళ్లిన సదరు కంపెనీ ఉద్యోగులు మొదటి నుండి డబ్బులు ట్రాన్సాక్షన్ పెద్ద మొత్తంలో చేస్తున్నట్లు గమనిస్తే తప్ప ఇంత రిస్క్  చేయరు అని భావిస్తున్నారు. మరోవైపు ఆ రూట్ మ్యాప్ లో ఉన్న సీసీటీవీలో దృశ్యాలను, సెల్ టవర్ లొకేషన్ లను సేకరిస్తూ అనుమానిత నెంబర్లను ట్రేస్ చేస్తున్నారు పోలీసులు.