తెలంగాణ సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలపై దుమారు ఇంకా తగ్గలేదు. దీనికి కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్‌, బీజేపీ రెండు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకేసి కేసీఆర్‌పై కేసు పెట్టింది. 
 
రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే వరకు కేసీఆర్‌ను వెంటాడతామంటున్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అప్పటి వరకు కాంగ్రెస్ పోరాటం ఆగబోదంటున్నారాయన. 


భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారని సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఫిర్యాదు చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఆయనతోపాటు జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి ఉన్నారు. కేసీఆర్, నమస్తే తెలంగాణ, టీ న్యూస్‌పై ఫిర్యాదు చేశారు. 






అంతర్జాతీయ దేశ ద్రోహుల కంటే ప్రమాద కరమైన వ్యక్తి కేసీఆర్ అని తీవ్రస్థాయిలో ఆరోపించారు రేవంత్‌ రెడ్డి. ఈ ముగ్గురిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు రేవంత్‌ రెడ్డి. కఠినమైన చర్యలు తీసుకోపోతే న్యాయస్థానాల తలుపు తడుతామని హెచ్చరించారు. 


రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్‌కు శిక్ష పడే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదన్నారు రేవంత్‌. ఇప్పటికైనా కేసీఆర్ బయటకు వచ్చి బహిరంగంగా భారత రాజ్యాంగానికి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. 






ఎనిమిది సంవత్సరాల కాలంలో బీజేపీకి సంపూర్ణ సహకారం అందించిన కేసీఆర్ ఇప్పుడు తిట్టడం అంటే చీకటి ఒప్పందాల్లో తేడా రావడమేనన్నారు. దళితులంటే కేసీఆర్ కి వివక్ష అని రేవంత్ రెడ్డి విమర్శించారు. 






భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గము స్థానిక 1టౌన్ పోలీసుస్టేషన్ లో టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ కూడా కేసీఆర్‌పై ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఫిర్యాదు చేస్తున్నారు. తక్షణం తన మాటలను ఉపహరించుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.