కరీంనగర్ నుంచి ఏ పని చేసినా విజయవంతం అవుతుందన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తాను చదువుకున్నప్పటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు.
కరీంనగర్ నా అడ్డ
తాను కరీంనగర్‌లోని ఆసుపత్రిలో పుట్టినట్టు తెలిపారు మంత్రి కేటీఆర్. చదువంతా కరీంనగర్‌లోనే సాగిందన్నారు. సెయింట్ జోసేప్ పాఠశాల తిరిగిన రోజులు ఇంకా గుర్తున్నాయన్నారు. కరీంనగర్‌తో ఎనలేని అనుబంధం ఉందన్న కేటీఆర్.. తమకు ఈ నగరం లక్ష్మీనగర్ అని అభిప్రాయపడ్డారు. ఏ పని మొదలు పెట్టిన విజయవంతమవుతుందని తెలిపారు.
కరీంనగర్‌కు తిరుగులేదు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కరీంనగర్ అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఫించన్ 10 రెట్లు పెరిగిందన్నారు. తెలంగాణలో ఇప్పుడు మాతాశిశు మరణాలు తగ్గాయని వివరించారు. త్వరలోనే కరీంనగర్‌లో మెడికల్ కాలేజీ రాబోతుందని పేర్కొన్నారు.
పంచాయితీలు లేవు
తెలంగాణ వచ్చాకే ఇంత అభివృద్ది చూస్తున్నామన్నారు కేటీఆర్. ఇప్పుడు నీళ్ళ పంచాయితీ లేదని గుర్తు చేశారు. ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తున్న మొట్టమొదటి ప్రభుత్వం తమదన్నారు.
బండి చేసిన మేలు ఏంటి
ఇంతలా తెలంగాణ అభివృద్ధి చెందుతుంంటే.. బీజేపీ వాళ్లు నానా యాగి చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. బుల్డోజర్లు తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు తీస్తారా అని ప్రశ్నించారు కేటీఆర్. ఇప్పటికే తెలంగాణలో గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్.
గంగుల మీద గెలుస్తావా?
కరీంనగర్ నుంచి గెలిచిన బండి సంజయ్ తన ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గంగుల కమలాకర్‌పై పోటీ చేసి గెలిచే దమ్ముందా అని బండికి కేటీఆర్ సవాల్ చేశారు. గంగులను లక్షకుపైగా మెజార్టీతో గెలిపించుకుంటామన్నారాయన.
ఒక్క పని అయినా చేశారా?
ఎంపీగా గెలిచి మూడేళ్ళు అవుతున్నా మూడు కోట్ల పని అయిన బండి చేశారా అని నిలదీశారు కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇయ్యాలని ఒక్కసారి అయిన అడిగారా అని ప్రశ్నించారు. కరీంనగర్ కి ఒక్క కాలేజ్ అయిన తీసుకువచ్చినావా?
ఆ పని తెప్ప వేరేది తెలియదు
డబ్బాలో రాళ్ళు వేసి ఊపినట్టు రోజూ మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ వాళ్లు పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు కేటీఆర్. బండి సంజయ్ అనే ఎంపీ తన పార్లమెంటు పరిధిలోని ఒక అసెంబ్లీకైనా ఒక్క పని కూడా చేయలేదన్నారు. అలాంటి వ్యక్తి పిల్లగాళ్ళని చెడగొట్టుడు,మత పిచ్చి లేపుడే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషం నింపుడు,విషం చిమ్ముడే లక్ష్యంగా మారిందన్నారు.
అక్కడే బతుకుమ్మ సంబరాలు
ఈసారి మహిళలంతా మానేరు రివర్ ఫ్రంట్ వద్ద బతుకమ్మ ఆడుకోవచ్చన్నారు కేటీఆర్. ఆ స్థాయిలో అక్కడ పనులు జరిగాయన్నారు. కరీంనగర్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందన్న కేటీఆర్...ఈ ఒక్కరోజు వెయ్యి కోట్లకు పైగా పనులకు శంకుస్థాపన చేశామన్నారు.
కమలాకర్ పొగడ్తలు
ఈ సభలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్... కేసిఆర్, కేటీఆర్‌ను ఆకాశానికి ఎత్తేశారు. గాడ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ అయితే ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ అంటూ పొగడ్తల పర్వం కొనసాగించారు. కేసీఆర్ పుట్టిన గడ్డపై తాను పుట్టడం తన అదృష్టమన్నారు. దేశానికే తలమానికంగా మానేరు రివర్ ఫ్రంట్ నిలుస్తుందన్న ఆయన..కరీంనగర్ కోసం ఏది అడిగినా కేసీఆర్ కాదనకుండా నిధులిస్తున్నారన్నారు.