కరీంనగర్ జిల్లాలో గులాబీ జోరు పెంచింది. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఈ ఏడాది రూ.1030 కోట్లతో చేపట్టే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇందులో ముఖ్యంగా మానేరు జలాశయం నుండి కేబుల్ బ్రిడ్జి వరకూ వంద కోట్లతో పర్యాటక సుందరీకరణ, నగరంలో సమగ్ర అభివృద్ధి కోసం రూ.615 కోట్లతో చేపట్టే రోడ్లు, సీసీటీవీ కెమెరాలు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక 5 కోట్లతో నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులతో ముచ్చటించనున్నారు. ఇక తెలంగాణలోనే లేని విధంగా కరీంనగర్లో మొట్టమొదటిసారిగా పది ఎకరాల స్థలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వెంకటేశ్వర ఆలయం నిర్మాణంపై కూడా మంత్రి గంగుల కమలాకర్ తో పరిశీలించనున్నారు. కేటీఆర్ రాక సందర్భంగా సుమారు 5 వేల టూవీలర్ ల తో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు.


గులాబీ మయమైన కరీంనగర్ ...
ఒకే రోజు భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు వస్తున్న కేటీఆర్ కి ఘనంగా స్వాగతం పలకడానికి మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో స్థానిక నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. పట్టణానికి 10 కిలోమీటర్ల దూరం నుండి ఘనంగా ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భద్రతా సమీక్షను ఉన్నత అధికారులతో కలిసి నిర్వహించారు మంత్రి గంగుల కమలాకర్.


కేటీఆర్ కరీంనగర్‌లో పర్యటన వివరాలు
* ఉదయం 10:30 గంటలకు శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల తిమ్మాపూర్ నుండి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో ఘన స్వాగతం.
* ఉదయం 11 గంటలకు నగరంలోని మానేరు వంతెన పై నగరపాలక సంస్థకు చెందిన మిషన్ భగీరథ వాటర్ పైలాన్ ప్రారంభోత్సవం, 24/7 మంచి నీటి సరఫరా మరియు మానేరు రీవర్ ఫ్రంట్ ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేయనున్నారు.
* ఉదయం 11:30 గంటలకు నగరంలోని రాంనగర్, పద్మానగర్ ఏరియాలో గల మార్క్ ఫేడ్ గ్రౌండ్ లో నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీ వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన. అనంతరం తెలంగాణ రాష్ట్ర అభివృద్ది సంక్షేమ పథకాలపై సభలో ప్రసంగం.
* మధ్యాహ్నం 1 గంటలకు చొప్పదండికి బయలుదేరి, చొప్పదండిలో అభివృద్ది కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 4 గంటలకు తిరిగి కరీంనగర్ నగరానికి చేరుకుంటారు.
* సాయత్రం 4 గంటలకు ఉజ్వల పార్కు వద్ద ఉన్న ఐటీ టవర్ లో జిల్లా మున్సిపల్ అధికారులు మరియు జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం.