కరీంనగర్ జిల్లాలో ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఇతర జనాల నుండి ఏదైనా పని కోసం డబ్బులు డిమాండ్ చేస్తే దాన్ని లంచం అంటారు. మరి తమ తోటి ఉద్యోగుల అవసరాన్ని ఆదాయంగా మార్చుకునే పరిస్థితిని ఏమంటారో? జిల్లా సమీపానికి బదిలీపై రావడానికి పలువురు టీచర్లు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో ఇప్పటి వరకు తమ పిల్లల చదువుల విద్యా సంవత్సరం ఆఖరు కావడంతో పలువురు తిరిగి జిల్లా వైపు రావడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ మధ్య జిల్లాకు వచ్చిన కొందరు టీచర్లు పెద్ద ఎత్తున డబ్బులకు డిమాండ్ చేస్తున్నారు.


పెద్దపల్లి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఓ యూనియన్ లీడర్‌గా ఉన్న టీచర్ ప్రస్తుతం కరీంనగర్ జిల్లాకి రావడానికి హుజూరాబాద్‌కు చెందిన ఉపాధ్యాయుడితో బేరం చేశారు. దీనికి 15 లక్షలు సదరు టీచర్ డిమాండ్ చేశారు. అంత డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో తిరిగి ఆ ఉపాధ్యాయుడు పెద్దపల్లి జిల్లాలోనే ఉండేందుకు నిర్ణయించుకున్నాడు.


మరో సంఘటన ఇలాగే జరిగింది. కరీంనగర్ నుండి పెద్దపల్లి జిల్లాకు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుడు తిరిగి పరస్పర బదిలీ కోసం వెతకగా కరీంనగర్ కి దగ్గర్లో ఉన్న జడ్పీ పాఠశాల ఉపాధ్యాయుడు 12 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో వారి మధ్య ఇప్పటికే బేరసారాలు కొనసాగుతున్నాయి.


ఎందుకింత డిమాండ్?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి విడిపోయిన కొత్త జిల్లాల్లో నిజానికి పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేవని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే తమ పిల్లలు విద్యా సంవత్సరం ఆఖరి దశలో ఉండడంతో మరోవైపు వృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులు చూసుకునే పరిస్థితి ఉండటం వంటి పరిస్థితుల మధ్య, గత్యంతరం లేని పరిస్థితుల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉండడానికి ఆసక్తి చూపుతున్నారు. పాత టీచర్లు ఇందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. 


మరోవైపు కొత్తగా వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసి మరీ తమకు కావాల్సిన పోస్ట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అదే ఆలోచనతో ఉన్న మిగతా వారి వద్ద  టీచర్లు భారీగా డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ విషయం ఎక్కడా బయటకు చెప్పబోమని హామీలు సైతం ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి బదిలీలకు ఆన్‌లైన్‌లో రాష్ట్ర విద్యా శాఖకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఈనెల 15వ తారీఖున ముగుస్తుండటంతో బేరసారాల వ్యవహారం మరింత ఊపందుకుంది. అసలు విద్యారంగాన్ని అబాసుపాలు అయ్యేలా చేస్తున్న ఈ వ్యవహారంపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారం బయటకి రావడం ఇదే మొదటిసారి కాదు. కానీ ట్రాన్స్‌ఫర్ కోసం ఏకంగా రూ.15 లక్షల వరకు డిమాండ్ చేయడం అనేది చర్చనీయాంశం అయింది.