Telangana bjp President Ramachander Rao | హైదరాబాద్: జాబ్ రావడం లేదని ఓ పాతికేళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాధాకరం అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడంతో సిరిసిల్ల జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ కష్ట సమయంలో యువకుడు శ్రీకాంత్ కుటుంబ సభ్యులకి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. 

యువకుల ఆత్మహత్యలు ఆగకపోవడంపై విచారం

తెలంగాణ (Telangana) ఏర్పాటై దశాబ్దం గడుస్తున్నా రాష్ట్రంలో ఇంకా ఈ యువకుల ఆత్మహత్యలు ఆగకపోవడంపై విచారణం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు యువకులు, నిరుద్యోగ యువతకు ఎన్నో వాగ్దానాలు చేసింది. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి అని చెప్పిందని, ఆపై రాజీవ్ యువ వికాసం పథకం అని ఎన్నో మాయ మాటలు చెప్పి, వారిని మభ్య పెట్టిందని రామచందర్ రావు విమర్శించారు. ఎన్నికల్లో నోటికొచ్చిన హామీలతో ప్రజలతో మోసం చేసిన కాంగ్రెస్ నేతలు అధికారం వచ్చిన తరువాత, నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని మండిపడ్డారు. 

సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం ప్రభుత్వం వల్లనే శ్రీకాంత్ లాంటి ఎందరో యువకులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా.. పాలకులు మారారు తప్ప, పాలనలో ఏ మార్పు లేదన్నారు. దశాబ్దం గడిచినా రాష్ట్ర ప్రజల పరిస్థితీ మెరుగుపడలేదన్నారు. నిరాశపడకండి, తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని తెలంగాణ యువతకు, నిరుద్యోగులకు విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగుల పక్షాన, వారి వెన్నంటి భారతీయ జనతా పార్టీ ఉంటుందని, ఈ పోరాటంలో మీతో భుజం కలిపి పోరాడేది బీజేపీనే అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య.. సిరిసిల్ల జిల్లాలో విషాదంగంభీరావుపేట: చదువు పూర్తయ్యాక, ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావడం లేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలో ఈ ఘటన జరిగింది. నర్మలకి చెందిన లోకం శ్రీకాంత్ అనే 25 ఏళ్ల యువకుడు ఉద్యోగాల కోసం పలు పోటీ పరీక్షలు రాశాడు. ఎంత ప్రయత్నించినా జాబ్ రాకపోవడం, కుటుంబానికి మారుతున్నానని భావించిన శ్రీకాంత్ మనస్తాపం చెంది హైదరాబాద్ నుంచి స్వగ్రామం నర్మలకు వచ్చాడు. గ్రామం సమీపంలోని తమ చేనులోని మామిడి చెట్టుకు గురువారం  ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన వారు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శ్రీకాంత్ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు