Telangana Cabinet: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో రేవంత్ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. గత 18 మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు వాటి అమలు తీరుపై కూడా సమీక్ష జరిపింది. 

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర మంత్రివర్గం కేబినేట్ భేటీలకు సంబంధించి కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు జరిగిన కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, అమలుపై సమీక్ష జరిపింది. 

321 అశాలపై చర్చ 

2023 డిసెంబర్ 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు 18 కేబినెట్ సమావేశాలు జరిగాయి. 19వ సమావేశంలో వాటిపై సమీకక్ష నిర్వహించింది. మొత్తం 327 అంశాలు చర్చించింది. వీటిలో 321 అంశాలను కేబినేట్ ఆమోదించింది. మిగతా వాటి అమలు పురోగతిని శాఖలవారీగా అధికారులతో మంత్రివర్గం చర్చించింది. 

కొత్తగా 22 వేల ఉద్యోగాలుఈ ఏడాదిన్నర వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. వీటితోపాటు మరో 17084 ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. కొత్తగా 22033 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం చర్చించింది. వివిధ విభాగాల్లో పని చేస్తున్న ప్రతీ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పనితీరును సమీక్షించేందుకు వీలుగా వారి ఆధార్, పూర్తి వివరాలు సేకరించాలని ఆర్థిక శాఖను మంత్రివర్గం ఆదేశించింది. 

ప్రభుత్వ ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరిగేలా

ప్రభుత్వ ఉద్యోగుల హాజరుతోపాటు విధినిర్వహణలో జవాబుదారీతనం పెంచేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి నియమించిన అధికారుల కమిటీకి ఈ బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. 2 నెలల్లో పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

గ్రామపంచాయతీల డీలిస్టింగ్

సంగారెడ్డి జిల్లాలో ఇటీవల రెండు కొత్త మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పడ్డ జిన్నారం, ఇంద్రీశం మున్సిపాలిటీల పరిధిలో చేర్చే 18 గ్రామ పంచాయతీలను డీ లిస్టింగ్ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో అధునాతనంగా గోశాలల ఏర్పాటు, నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వచ్చే కేబినేట్ సమావేశంలోపు కమిటీ తమ నివేదికను అందించాలని గడువు నిర్ణయించింది. 

కొత్తగా గోశాల నిర్మాణానికి ఓకే 

ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పశుసంవర్థక శాఖ రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను, కొత్తగా నిర్మించే గోశాల డిజైన్లను మంత్రివర్గ భేటీలో ప్రదర్శించారు. రాష్ట్రంలో 306 గోశాలలున్నాయి. హైదరాబాద్లో ఎన్కేపల్లి, వెటర్నరీ యూనివర్సిటీ, వేములవాడ, యాదగిరిగుట్టలో అత్యాధునికంగా గోశాలలు నిర్మించాలని నిర్ణయించారు. వీటితోపాటు రాష్ట్రంలో ఉన్న గోశాలల రిజిస్ట్రేషన్లు, వాటి నిర్వహణపై సమగ్ర విధాన పత్రం రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.