Hyderabad Crime News:  వర్క్ ఫ్రం హోం.. ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి క్లిక్కులు చేస్తే చాలు డబ్బులిచ్చేస్తామని కొన్ని లింకులు వస్తూ ఉంటాయి. వాటిని క్లిక్ చేస్తే జీవితాన్ని అథంపాతాళంలోకి తీసుకెళ్లిపోతారు సైబర్ నేరాళ్లు. హైదరాబాద్ కెపిహెచ్‌బి (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలో తులసి నగర్‌లో ఒక మహిళ ఇలాగే మోసపోయి.. కుటుంబసభ్యులకు ఏం చెప్పాలో తెలియక ప్రాణాలు తీసుకుంది. 


వర్క్ ఫ్రం హోం చేయాలనుకున్న  అనూష -  మోసం చేసిన టెలిగ్రాం ఫేకర్స్              


ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనూష అనే  మహిళ  తన భర్త వెంకన్న బాబుతో కలిసి హైదరాబాద్‌లోని కెపిహెచ్‌బి తులసి నగర్‌లో నివసిస్తోంది. వీరి వివాహం ఐదు సంవత్సరాల క్రితం జరిగింది. వెంకన్నబాబు ఉద్యోగం చేస్తూండగా అనూష ఖాళీగానే ఉంది. వర్క్ ఫ్రం హోం అవకాశం అని ఓ సారి మెసెజ్ రావడంతో క్లిక్ చేసింది. వారు మొదట వెయ్యి రూపాయలు చెల్లించాలని షరతు పెట్టారు. తర్వాత మెల్లగా ఆ రిజిస్ట్రేషన్ అని.. ఈ రిజిస్ట్రేషన్ అని మాటలు చెప్పి దాదాపుగా లక్ష రూపాయలు వసూలు చేసారు. అసలు వర్క్ ఫ్రం జాబ్ ఇవ్వకపోగాఆ లక్ష రూపాయలు కూడా ఇవ్వకుండా మోసం చేశారు.              


ఆన్లైన్ బెట్టింగుల్లోనూ కొంత డబ్బు పోగొట్టుకున్న  అనూష                    


అదే సమయంలో అనూషకు.. ఆన్ లైన్ బెట్టింగుల అలవాటు కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ బెట్టింగ్ కారణంగా ఆమె ఆర్థిక స్థితి మరింత దిగజారింది. ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే కోప్పడతారన్న భయంతో ఏ దారి లేక  అనూష ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.   ఘటన తెలిసిన వెంటనే కెపిహెచ్‌బి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, అనూష మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు .  పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.  కెపిహెచ్‌బి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.  సైబర్ మోసం, బెట్టింగ్‌కు సంబంధించిన వివరాలను లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అనూష ఉపయోగించిన టెలిగ్రామ్ లింక్‌లు , బెట్టింగ్ యాప్‌ల మూలలను వెలికి తీస్తున్నారు.  ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు,  సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు సైబర్ క్రైమ్ విభాగం సహాయం తీసుకుంటున్నారు.      


వర్క్ ఫ్రం హోం ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు                       
 
 ఆన్‌లైన్ బెట్టింగ్ లేదా "వర్క్ ఫ్రం హోం" పేరుతో వచ్చే ఆఫర్‌లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.  సైబర్ మోసాల గురించి ఫిర్యాదు చేయడానికి 1930 నెంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చు.  ఆత్మహత్య నివారణ కోసం రోషిణి హెల్ప్‌లైన్ నెంబర్లు  8142020033/44, 040 66202000/2001 ను సంప్రదిస్తే కౌన్సెలింగ్ ఇస్తారు.