Bandi Sanjay Comments At Praja Sangrama Yatra: ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా చేస్తున్న 5వ విడత పాదయాత్రలో తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో చేపట్టే పనులను తానే చేస్తున్నట్లుగా సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలేదని, సీఎం కూతురు, ఎమ్మెల్సీ కవితకు మీటర్ పెట్టడంతో గిరగిర తిరుగుతోందని సెటైర్ వేశారు. సీబీఐ అధికారులు ఆదివారం కవిత నివాసానికి వెళ్లి ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్న సందర్భంగా కవితపై బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు నిధులు లేవా !
బీజేపీని గెలిపిస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపెడతామనని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అయిలాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సంజయ్ ప్రసంగించారు. అయిలాపూర్ గ్రామాన్ని మండలంగా చేస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇంకా చేయలేదన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే అయిలాపూర్ ను మండలంగా ప్రకటిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను విస్మరిస్తున్నారని విమర్శించారు. రూ. లక్ష కోట్లు సారా వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు నిధులు ఉంటాయి. కానీ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు నిధులు లేవా అని సీఎం కేసీఆర్‌ను బండి సంజయ్ ప్రశ్నించారు. అయిలాపూర్ లో బీజేపీ జెండా ఎగరవేశారు.
పాదయాత్ర కిషన్ రావుపాలెం నుంచి కోరుట్లకు చేరుకోగా డప్పు చప్పుళ్ళు, గోండుల నృత్యాలు, మహిళల మంగళహారతులతో బండి సంజయ్‌కి ఘన స్వాగతం పలికారు. పెద్దమ్మ గుడి నుంచి అయిలాపూర్ కార్గిల్ చౌరస్తా జాతీయ రహదారి వెంబడి కొత్త బస్టాండ్ వరకు పాదయాత్ర కొనసాగించారు. తరువాత పాత కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద సంజయ్ మాట్లాడుతూ.. కులవృత్తులను సీఎం కేసీఆర్ ఓ వర్గానికి అంటగడుతున్నారని అన్నారు. తెలంగాణ పేరుతో ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (BRS) పెట్టి రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని మంటగల్పారని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రావు, తుల ఉమా, సురభి నవీన్, జేఎన్ వెంకట్, సునీత, సాంబారి ప్రభాకర్, కొడిపెల్లి గోపాల్ రెడ్డి, శీలం వేణు, పంచరి విజయ్ తదితరులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. శిబిరం దగ్గర యూసఫ్ నగర్ సర్పంచ్ తుకారాం గౌడ్ ఆధ్వర్యంలో అయిలాపూర్‌కు చెందిన పలువురు బీజేపీలో చేరగా సంజయ్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
గల్ఫ్ ఐకాస ఛైర్మన్ గుగ్గిళ్ల రవిగౌడ్ సంజయ్ ని కలిసి సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. యూసఫ్ నగర్, అయిలాపూర్ రహదారిలో రైతుల కోరిక మేరకు బండి సంజయ్ ట్రాక్టర్‌తో కొద్దిసేపు పొలం దున్నారు. అనంతరం పాదయాత్ర కొనసాగించిన బండి సంజయ్ రహదారికి ఇరువైపులా ఉన్నవారికి అభివాదం చేస్తూ పలకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి, బీజేపీ సీనియర్ నేత కోల భూమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గౌడ సోదరుల కోరిక మేరకు కల్లు తాగి రుచి చూశారు. తాము అధికారంలోకి వచ్చాక గౌడ సోదరులకు అండగా ఉంటామన్నారు.