SSC Paper Leakage Case: యుద్ధానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. టెన్త్‌ పేపర్‌ లీకేజీ కేసులో కరీంనగర్‌ జైలు నుంచి విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి మోదీ సభతో బీజేపీ సత్తా ఏంటీ చూపిద్దామన్నారు. గ్రామ గ్రామం నుంచి పరేడ్స్ గ్రౌండ్‌కు తరలి రావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ కుమారుడు, కుమార్తె జైలుకు పోవడం ఖాయమని ఈ ప్రభుత్వం కూలిపోవడం కూడా భవిష్యత్‌లో చూడబోతున్నామన్నారు బండి. 


ప్రశ్నించిన తమను పిచ్చోళ్లు అంటున్నారని... అలాంటిది తాగుబోతుల చేతుల్లో రాష్ట్రం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. కేసీఆర్ ఫ్యామిలీలోనే లీకు వీరులు, లిక్కర్‌ వీరులు ఉన్నారని ఎద్దేవా చేశారు. టీఎస్‌పీఎస్‌సీ నుంచి నేటి వరకు లీకులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్‌ను ముందు మంత్రిపదవి నుంచి తొలగించాలని... నిరుద్యోగులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 


ఈ లీకులపై పోరాటం ఆపే ప్రసక్తి లేదన్నారు బండి సంజయ్‌. లీకులపై తనకు ఎలాంటి సంబంధం లేదని తన పిల్లలపై, దేవుడిపై ప్రమాణం చేసి చెబుతానని.. కేసీఆర్‌ ఫ్యామిలీ కూడా ప్రమాణం చేస్తుందా అని ప్రశ్నించారు బండి. దీనిపై చర్యలు తీసుకునే వరకు తాము వెనక్కి తగ్గబోమన్నారు. ఇప్పటికే లిక్కర్ కేసులో కవిత అరెస్టు కాబోతున్నారని.. త్వరలోనే కేటీఆర్‌ కూడా జైలుకు వెళ్తారని జోస్యం చెప్పారు బండి సంజయ్. 


ఈ కేసులో వరంగల్ సీపీ రంగనాథ్‌ చెప్పిన విషయాలు చూసిన జనం ఆశ్చర్యపోతున్నారని విమర్శించారు బండి సంజయ్‌. హిందీ పేపర్‌ లీక్ చేసింది తామనని చెబుతున్న పోలీసులు... మొదటి రోజు తెలుగు పేపర్‌ ఎలా లీకు అయిందో ఎందుకు చెప్పడం లేదన్నారు. అసలు లీక్‌కు మాల్‌ప్రాక్టీస్‌కు తేడా తెలియకుండా సీపీ మాట్లాడుతున్నారని ఆరోపించారు.  


ఉదయం జైలు నుంచి బయటకు


టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ ఉదయం క్రితం విడుదలయ్యారు. పేపర్ లీకేజీ కేసులో హన్మకొండ కోర్టు బండి సంజయ్ కు గురువారం అర్థరాత్రి బెయిల్‌ మంజూరు చేసింది. ఈ ఉదయం ఫస్ట్‌ అవర్‌లో ప్రక్రియను పూర్తి చేసిన బీజేపీ లీగల్‌ సెల్‌ బండి సంజయ్‌న బయటకు తీసుకొచ్చింది. 


తెలంగాణ పదోతరగతి పరీక్షల్లో పేపర్‌ లీకేజీ కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు కుట్ర పన్నారన్న కారణంతో బండి సంజయ్‌ను రెండు రోజుల క్రితం కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య హన్మకొండ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే.. బుధవారం నాడు 14 రోజుల రిమాండ్ విధించారు. తనకు వరంగల్‌ జైల్లో ప్రమాదం ఉందని కరీంనగర్‌ తరలించాలని సంజయ్‌ విజ్ఞప్తితో అక్కడకు తరలించారు. 


బీజేపీ లీగల్ సెల్ టీమ్ సంజయ్ తరఫున హన్మకొండలో బెయిల్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై గురువారం మధ్యాహ్నం నుంచి 8 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం ఇద్దరు వ్యక్తుల హామీ, రూ.20 వేల పూచీకత్తుతో హన్మకొండ కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం ఉదయం అన్ని ఫార్మాలిటిస్ పూర్తి చేసిన లీగల్‌ సెల్‌ బండి సంజయ్‌ను కరీంనగర్ జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు.