Tirupati To Karimnagar Special Trains | కరీంనగర్: తెలంగాణలోని కొన్ని ముఖ్యమైన పట్టణాల నుంచి తిరుపతికి నేరుగా రైలు సర్వీసులు లేకపోవడం ప్రయాణికులను, శ్రీవారి భక్తులను ఇబ్బందులకు గురిచేస్తుంది. దాంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుండి తిరుపతి , తిరుపతి నుండి కరీంనగర్ కి రైలు సర్వీసులు నడపాలని కేంద్రాన్ని కోరారు. పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు తిరుపతికి ప్రత్యేక రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ నుండి తిరుపతికి నాలుగు రైళ్లు, తిరుపతి నుండి కరీంనగర్ కి వెళ్లడానికి 4 ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి.
కరీంనగర్ నుంచి నిత్యం తిరుపతికి రైళ్లు నడిపించాలని ఇప్పటికే పలుమార్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.ఈ రైలు ద్వారా తిరుపతి వెళ్ళే ఉత్తర తెలంగాణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మే 22 న కరీంనగర్ రైల్వే స్టేషన్ పునః ప్రారంభం సందర్భంగా తిరుపతి రైలు సర్వీసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి విజ్ఞప్తి చేశారు. ప్రభాకర్ విజ్ఞప్తికి స్పందించిన రైల్వే శాఖ కరీంనగర్ నుండి తిరుపతి కి వెళ్ళే రైలు సేవలను పెంచింది. ఈ మేరకు గురువారం (జూన్ 12న) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రత్యేక రైలు జూలై 6 నుండి జూలై 27 తేదీల మధ్య నడిపించనున్నారు.
ఈ స్పెషల్ రైళ్లు ఆదివారం రాత్రి 7:45 గంటలకు తిరుపతి నుండి బయలుదేరి సోమవారం ఉదయం 10:00 గంటలకు కరీంనగర్ పట్టణానికి చేరుకోనుంది. అదే విధంంగా సోమవారం సాయంత్రం 5:30 కి కరీంనగర్ నుండి బయలుదేరి మంగళవారం ఉదయం 8:25 కి తిరుపతి చేరుకోనుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రత్యేక రైలు ప్రయాణికుల రద్దీని బట్టి రెగ్యులర్ గా రైలు సర్వీసులను కొనసాగించే అవకాశం ఉంటుంది.
కరీంనగర్ నుండి తిరుపతి కి ప్రత్యేక రైలు వేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఈ సర్వీస్ కోసం సహకరించిన కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రత్యేక రైలును ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో కోరారు.