ఈ మధ్య కాలంలో దుబాయిలో ఓ కొత్త ట్యాక్స్ అమలు చేశారు. బాల్కనీలో బట్టలు ఆరబెడితే పన్ను వేస్తామని ప్రభుత్వం ప్రజలకు చెప్పింది. ఇది విన్న వాళు చాలా మంది ఆశ్చర్యపోయారు. సిరిసిల్ల పోలీసులు మాత్రం మరో అడుగు ముందుకేశారు. ఇది చివరకు తెలంగాణ డీజీపీ వరకు వెళ్లి రచ్చరచ్చ అయింది.
ట్రాఫిక్ పోలీసుల బాదుడుకు ఓ నెటిజన్ ఏకంగా డీజీపీకే ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని తనకు జరిగిన అన్యాయంపై గళమెత్తాడు. ఇప్పుడాయన చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. పోలీసుల తీర్పుపై మళ్లీ విమర్శలు స్టార్ట్ అయ్యాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ ఫోర్ వీలర్ ఓనర్‌కి మెసేజ్ వచ్చింది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు వందలరూపాయల ఫైన్ వేశామని ఆ మెసేజ్ సారాంశం. ఈ మెసేజ్ చదివి ఒక్కసారి షాక్ తిన్న అతను ఈ ఛలాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేశారు. అందులో పెట్టిన కారణం చూసి మరోసారి అవాక్కయారాయన. యూనిఫాం వేసుకోలేదని వంద రూపాయలు ఫైన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు. మొత్తం కలిపి 135 రూపాయలు పెనాల్టీ విధించారు.
ఈ పెనాల్టీలో 35 రూపాయలు యూజర్ చార్జ్‌గా చెప్పారు. అసలు ఫోర్ వీలర్‌లో అది తన సొంత కారులో వెళ్లేటప్పుడు యూనిఫామ్ వేసుకోవడం ఏంటనీ అనుకున్నాడు. అందుకే ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేశారు.
ఆన్‌లైన్ ఛలాన్ వెబ్‌సైట్‌లో ఫైన్ వేసిన కాపీ, తన కారు ఫొటో అన్ని కలిపి స్క్రీన్ షాట్ తీసి డీజీపీకి సోషల్ మీడయా ద్వారా ఫిర్యాదు చేశారు. ఆయనకు ట్యాగ్ చేస్తూ తన ఆవేదన చెప్పుకున్నాడా వ్యక్తి. డీజీపీతోపాటు ఇతర ముఖ్య అధికారులకు కూడా ఈ సమస్యను ట్యాగ్ చేశారు.
ఇది వైరల్‌గామారింది. వ్యక్తిగతంగా వాడుకునే కారులో వెళ్తే యూనిఫామ్ వేసుకోవాలా అని ఆశ్చర్యపోయారు నెటిజన్లు. ఆయన పెట్టిన పోస్టుకు కామెంట్స్ చేశారు. దీన్ని గమనించిన పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. డీజీపీ ఈ సమస్యను పరిష్కరించాలని సిరిసిల్ల పోలీసులకు రిఫర్ చేశారు.
జరిగిన తప్పు తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు దిద్దుకునే ప్రయత్నం చేశారు. తాము ఫైన్ వేసింది యూనిఫామ్ వేసుకునేందుకు కాదని.. సీటు బెల్టు పెట్టుకోవడానికి అని చెప్పారు. ఆన్‌లైన్‌లో కూడా అలానే మార్చేశారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో చూస్తే రీజన్ అదే కనిపిస్తోంది. మొత్తానికి సిరిసిల్ల జిల్లా పోలీసులు ఇలా కాస్త వైరల్ అయ్యారు.