తెలంగాణలో జరిగే బడ్జెట్ సమావేశాలకు గవర్నర్‌ తమిళిసైను ఆహ్వానించకపోవడంపై బీజేపీ మండిపడుతోంది. దీనిపై స్పందించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ మూర్ఖత్వానికి ఈ నిర్ణయం పరాకాష్టని కామెంట్ చేశారు.  


గవర్నర్ సొంతగా ఏం చదవరు కదా


బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ను ఆహ్వానించకపోవడం మూర్ఖత్వమన్న బండి సంజయ్‌ నిజంగా ఇది అవమానకరమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ సొంత ప్రసంగం ఉండదని కేబినెట్ ఆమోదించిన ప్రసంగాన్నే అసెంబ్లీలో చదివి విన్పిస్తారన్నారు. 


అభివృద్ధి లేదనే ఈ నిర్ణయం


బహుశా కేసీఆర్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ఏమీ లేదని అందుకే గవర్నర్‌ ప్రసంగాన్ని తీసేశారని సెటైర్లు వేశారు. ప్రథమ పౌరురాలైన గవర్నర్‌ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తున్నారని ఏనాడు వివాదాస్పదాలకు జోలికి పోలేదన్నారు సంజయ్‌. 


ఆమె వివాదాస్పదురాలే కాదు


సీఎంను ఎన్నడూ గవర్నర్ అవమానించలేదన్నారు సంజయ్‌. ఏ ఒక్క పార్టీకి సపోర్ట్ చేయలేదని అభిప్రాయపడ్డారు. అలాంటప్పుడు ఎందుకు బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించలేదో కేసీఆర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 


కేసీఆర్‌కు మహిళలంటే గౌరవం లేదు


మహిళలంటే సీఎం కేసీఆర్‌కు చులకన భావన అని అభిప్రాయపడ్డారు సంజయ్. మొదటి నుంచి కించపర్చడం ఆయనకు అలవాటని అందుకే మొదటి కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా చోటివ్వలేదని గుర్తు చేశారు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు.


క్షమాపణ చెప్పాలి


గవర్నర్ వ్యవస్థనే సీఎం కేసీఆర్ కించపర్చుస్తున్నారని.. మహళా గవర్నర్ ను అవమానించడమంటే రాష్ట్రంలోని మహిళలందరినీ అవమానించినట్లేనన్నారు సంజయ్. తెలంగాణ ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 


బెంగాల్‌ తరహా రాజకీయాలు సహించం


కేసీఆర్‌ బెంగాల్ తరహా రాజకీయాలు చేద్దామనుకుంటున్నారని... తాము మాత్రం చూస్తూ ఊరుకోబోమంటున్నారు బండి సంజయ్‌. ఇకనైనా ప్రజాస్వామ్యబద్దంగా, రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలని సూచించారు సంజయ్‌. బరి తెగించి ఏది పడితే అది చేస్తానంటే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు సంజయ్‌.


తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని... కేసీఆర్ పీకేతో కలిసి పనిచేసినా...ఆ పీకేలు, గీకేలు ఏమీ చేయలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు సంజయ్.


వేములవాడులో సౌకర్యాలు నిల్‌


వేములవాడ  రాజరాజేశ్వర స్వామిని సందర్శించుకున్న బండి సంజయ్‌.. దేవాలయంలో ఇబ్బందులపై కూడా స్పందించారు. వేములవాడ ఆలయంలో సిస్టమ్ లేదని... సౌకర్యాల్లేవని మండిపడ్డారు. తాగడానికి నీళ్లు కూడా లేవని  పార్కింగ్‌కు ఇబ్బందులేనని విమర్శించారు. అధికారులకు ఎవరూ సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్.


దేవాలయ అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం నిధులివ్వడం లేదన్న సంజయ్‌  విమర్శించారు. ఏటా వంద కోట్లు ఇస్తామన్న హామీని అమలు చేయడం లేదన్నారు. ఉన్న నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోందన్నారు. 


ప్రతిపాదనలు  పంపిస్తే ప్రసాదం ఇస్తాం


వేములవాడ దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ‘ప్రసాదం’ స్కీం కింద ప్రతిపాదనలు పంపితే కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయిస్తామన్నారు బండి సంజయ్‌. దీనిపై ఎన్నిసార్లు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.


పేరు ప్రతిష్టలు, పంతాలు, రాజకీయాలకు పోకుండా వెంటనే ‘ప్రసాదం’ స్కీం కింద ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొక్కసారి కోరుతున్నానన్నారు బండి సంజయ్‌.శివరాత్రి ఏర్పాట్లపై సీఎం కనీసం సమీక్ష నిర్వహించే తీరిక సీఎంకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సంజయ్‌. శివరాత్రి పండుగ తరువాత ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని ఎట్లా దారి మళ్లించాలనే దానిపై మాత్రం సమీక్షలు చేయడం కేసీఆర్‌కు అలవాటైందని కామెంట్ చేశారు. 


ఆయన్నెందుకు ఇంకా అరెస్టు చేయలేదు


డబుల్ బెడ్రూం ఇళ్లపేరుతో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిర్మల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ షాజీద్ ఖాన్‌ను ఎందుకు ఇంకా అరెస్టు చేయలేదని ప్రశ్నించారు బండి సంజయ్‌.


టీఆర్ఎస్ పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని బాలికలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని సంజయ్‌ ఆరోపించారు. బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టి రోజులు గడుస్తున్నా అరెస్టు చేయకపోగా...దోషిగా తేలితేనే పార్టీ నుంచి బహిష్కరిస్తామనడం సిగ్గు చేటన్నారు.