Bullettu bandi Song: జానపద గేయం "బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా"(Bullettu Bandi) ఈ మధ్య సోషల్ మీడియా(Social Media)లో హల్ చల్ చేసింది. ఈ పాట మళ్లీ వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్(YouTube Channel) వారి ఆధ్వర్యంలో జగిత్యాల మినీ స్టేడియంలో ఒకేసారి 1000 మంది చిన్నారులు, మహిళలు, యువతులతో "బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా" సాంగ్ కు నృత్యం ప్రదర్శన చేశారు. ఈ పాటపై బాలికలతో పాటు యువతుల వరకు అందరూ కలిసి నృత్యం చేయగా వీక్షకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు మచ్చారవికి అవార్డ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నేతలు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. జగిత్యాల, చొప్పదండి ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, సుంకే రవిశంకర్, కరీంనగర్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, జెడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంతా సురేష్, జిల్లా కలెక్టర్ జి. రవి, మున్సిపల్ ఛైర్ పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బుల్లెట్ బండి సాంగ్‌ను రచయిత లక్ష్మణ్ రాయగా ఎస్‌కే బాజి మ్యూజిక్ అందించారు.
ఎలా వైరల్ అయ్యిందంటే?
బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా అనే పాట ఇటీవల మారుమోగిపోతంది. ఎక్కడ వినా అదే పాట. సాయి శ్రీయ(Sai Shriya) అనే పెళ్లి కూతురు బరాత్ లో చేసిన డ్యాన్స్(Dance) తో ఈ పాటకు మరింత క్రేజ్ వచ్చింది. ఒరిజినల్ పాటలో కొరియోగ్రఫీ కంటే పెళ్లి బరాత్‌లో వధువు చేసిన డ్యాన్స్ ఆ పాటకు సూపర్ గా సెట్ అయిందనే ఫీల్ కలిగించింది. సాయి శ్రీయ డ్యాన్స్‌కు చాలామంది ఫిదా అయిపోయారు. సామాన్యుల నుంచి పలువురు ప్రముఖులు సైతం సాయి శ్రీయ డ్యాన్స్‌ను సోషల్ మీడియాలో కొనియాడారు. మంచిర్యాల జిల్లా జిన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్ఎస్ఓ రాము, సురేఖ దంపతుల కుమార్తె సాయి శ్రీయను రామకృష్ణాపూర్ కు చెందిన ఆకుల అశోక్ కు ఇచ్చి గత ఏడాది ఆగస్టు 14వ తేదీన పెళ్లి చేశారు. ఈ సమయంలో పెళ్లి అనంతరం జరిగిన బరాత్‌లో నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా అనే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ కు సాయి శ్రీయ డ్యాన్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. మీడియా ఛానెళ్లు సైతం వీడియోను వేశాయి.
పాటను ఆలపించిన మోహన భోగరాజు
బుల్లెట్టు బండి పాటను ఆలపించింది మోహన భోగరాజు(Mohana Bhogaraju). సంగీతంపై ఉన్న ఆసక్తి కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో మోహన ప్లేబ్యాక్ సింగర్‌గా ఎదిగారు. బాహుబలిలో మనోహరి, భలే భలే మగాడివోయ్ టైటిల్ సాంగ్, అరవింద సమేతలో రెడ్డమ్మ తల్లితోపాటు ఇటీవల వచ్చిన మగువా మగువా పాటలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఓ వైపు సినిమా పాటలతో పాటు సమయం దొరికినప్పుడల్లా ప్రైవేటు ఆల్బమ్స్ క్రియేట్ చేయడం ఆమె అభిరుచి. గత ఏడాది ఏప్రిల్ 7న ఆమె బుల్లెట్ బండి ప్రైవేట్ ఆల్బమ్ విడుదల అయింది. బుల్లెట్టు బండి పాటను లక్ష్మణ్ రాశారు. మోహన పాట పాడడమే కాకుండా దానికి అనువుగా నృత్యం చేశారు. ఒరిజినల్ వీడియో కన్నా ఇటీవల నవవధువు సాయి చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అయ్యాకే ఈ పాటకు మరింత క్రేజ్ వచ్చింది.