మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్వాసితులు నేడు (ఆగస్టు 29) ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నంది కమాన్ వద్ద బాధితులు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు వల్ల నిర్వాసితులు అయిన తమకు పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కట్టిన నాటి నుంచి తమకు ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వలేదని, డబుల్ బెడ్ రూంలు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇవ్వగా, ఇంత వరకూ ఎవరూ పట్టించుకోలేదని అన్నారు.


ఆ మేరకు వివిధ గ్రామాలకు చెందిన ముంపు బాధితులు మహాధర్నా చేపట్టి, వేములవాడకు వెళ్లేందుకు యత్నించగా, నంది కమాన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. చేసేది లేక వారు అక్కడే ధర్నా చేస్తుండడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిర్వాసితులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.


తక్షణం పరిహారం ఇప్పించాలి - రేవంత్
పోలీసులు బాధితులను అరెస్టు చేయడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. బాధితుల అరెస్టులను ఖండిస్తున్నట్లుగా చెప్పారు. సీఎం కేసీఆర్ తొలుత ఇచ్చిన హామీ మేరకు అందరికీ పరిహారం ఇప్పించాలని, అందుకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ఈ ఘటనపై ట్వీట్ చేశారు.


‘‘ఊరికో మోసం, వాడకో మోసం, ఇదీ కేసీఆర్ వేషం. మిడ్ మానేరు నిర్వాసితులకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా వాళ్ల పై పోలీసు జులుం చేయిస్తావా!? ప్రగతి భవన్ లో బిర్యానీ దావత్ ఇవ్వడమే రైతు సంక్షేమమా!? నిర్వాసితుల అరెస్టును ఖండిస్తున్నా. వారిని తక్షణం విడుదల చెయ్యాలి.’’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.






అరెస్టు చేసిన వారిని విడిపించండి - బండి సంజయ్


అరెస్టు అయిన మిడ్ మానేరు నిర్వాసితులను వెంటనే అరెస్టు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మిడ్ మానేరు నిర్వాసితులకు బీజేపీ పూర్తిగా అండగా ఉంటుందని బండి సంజయ్ అన్నారు.


‘‘మిడ్ మానేరు బాధితుల డిమాండ్లన్నీ న్యాయబద్దమైనవే. వారికి బీజేపీ పూర్తి అండగా నిలుస్తుంది.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మిడ్ మానేరు బాధితుల డిమాండ్లను తక్షణమే ప్రకటించాలి. తక్షణమే అరెస్ట్ చేసిన వారందరినీ బేషరతుగా విడుదల చేయాలి. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిడ్ మానేరు ప్రాజెక్టు కోసం భూములను, ఆస్తులను త్యాగం చేసిన బాధితులని కూడా చూడకుండా అరెస్ట్ చేయడమేంటి? కేసీఆర్ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గరపడ్డాయి. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలను పరిష్కరిస్తే ఆందోళన చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా? మిడ్ మానేరు ముంపు బాధితులకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న జేఏసీ నేతలు, బీజేపీ నేతల అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం. ముంపు గ్రామాల బాధితులపైనా పోలీసుల లాఠీఛార్జ్ చేయడం అత్యంత దుర్మార్గం.’’ అని బండి సంజయ్ వరుస ట్వీట్లు చేశారు.