ఆస్తిపై వ్యామోహంతో కన్న తల్లి చితి వద్దే కొడుకులు తగువులాడుకున్న ఘటన ఇది. కన్న తల్లికి అంత్యక్రియలు నిర్వహించే సమయంలో అత్యంత అమానవీయంగా వీరు ప్రవర్తించారు. ఆస్తే తమకు ముఖ్యం అన్నట్లుగా వ్యవహరించారు. ఈ తతంగం చూస్తున్న గ్రామస్థులంతా నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. గతంలో ఈ ఆస్తి పంపకాలపై గొడవలు జరగడం, పంచాయితీలు జరిగినా.. తల్లికి చివరి కార్యక్రమాలు నిర్వహించే చోట కొడుకులు గొడవ పడడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. ఆఖరికి చితి చుట్టూ కుండతో తిరిగేటప్పుడు కూడా పోటాపోటీగా తిరిగారు. చితికి నిప్పంటించడం కూడా ఒకర్నొకరు తోసుకుంటూ తలకొరివి పెట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో బుధవారం ఈ ఘటన జరిగింది.


రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామస్థులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లారం యశోద, భూమి రెడ్డి దంపతులు ఎల్లారెడ్డి పేటలో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పిల్లలు అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. భూమి రెడ్డికి మొత్తం ఎకరంన్నర పొలం ఉంది. తన పొలంలో పెద్ద కుమారుడు రామకిష్టా రెడ్డి, చిన్న కుమారుడు రవీందర్‌ రెడ్డికి చెరి 20 గుంటల చొప్పున గతంలోనే పంపకాలు చేశాడు. మిగిలిన భూమిని తమ కోసం తమ వద్దనే ఉంచుకున్నాడు. మూడు కుటుంబాలు వేర్వేరుగానే కాపురాలు ఉండేవి. 


ఆ మిగిలిన ఆస్తి కూడా పంచాలని తండ్రీకొడుకులకు తరచూ గొడవలు జరిగేవి. గత ఏడాది కుల సంఘం పెద్దలు పంచాయితీ కూడా చేశారు. తల్లితండ్రులను చివరిదాకా ఎవరైతే చూస్తారో వారికే మిగిలిన ఆస్తి దక్కుతుందని తీర్పు చెప్పారు. దీంతో కుమారులిద్దరూ నెలకు ఒకరు చొప్పున తల్లిదండ్రులను తమ వద్ద ఉంచుకుంటూ వచ్చారు. అయితే, గత 5 నెలలుగా భూమిరెడ్డి, అతని భార్య యశోద దాదాపు 5 నెలల నుంచి పెద్ద కొడుకు రామకిష్టారెడ్డి దగ్గరే ఉంటున్నారు. 


Also Read: బూస్ట్ నుంచి సర్ఫ్ ఎక్సెల్ వరకూ అంతా నకిలీవే.. డౌట్ రాకుండా తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్న ముఠా 


ఈ క్రమంలో తల్లి యశోద (92) అనారోగ్యంతో బుధవారం చనిపోయింది. దీంతో ఆస్తి కోసం అన్నదమ్ములిద్దరూ తల్లి శవం వద్దే గొడవ పడ్డారు. నాకే ఆస్తి దక్కాలంటూ వాదించుకున్నారు. చితి చుట్టూ కుండతో తిరిగే విషయంలో వారిద్దరి మధ్య తోపులాట జరిగింది. ఇద్దరూ తల్లి చితి చుట్టూ కుండతో తిరిగారు. అదే క్రమంలోనే చివరకు ఇద్దరూ పోటీపడి మరీ తల్లి చితికి నిప్పంటించారు.


Also Read: Fake Pregnancy: ఫేక్ ప్రెగ్నెన్సీతో భర్త, అత్తింటివారిని బోల్తా కొట్టించిన మహిళ.. ఎందుకో తెలిసి అవాక్కైన పోలీసులు


Also Read: Hyderabad: క్రెడిట్ కార్డు గురించి ఈ డీటైల్స్ గూగుల్‌లో అస్సలు వెతకొద్దు! అలా చేసినందుకు రూ.1.3 లక్షలు లూటీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి