PM Modi Warangal Visit: ప్రధాని నరేంద్ర మోదీ రేపు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో పర్యటించబోతున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సమావేశం ఏర్పాటు చేసి మరీ తెలిపారు. రూ.2146.86 కోట్లతో నిర్మించిన కరీంనగర్ - వరంగల్ 4 లైన్ల జాతీయ రహదారి విస్తరణ పనులను ప్రారంభించనున్నారని వెల్లడించారు. అలాగే అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. కరీంనగర్ - వరంగల్ నాలుగు లైన్ల రోడ్డు విస్తరణతో ప్రజలు కష్టాలు తీర్చబోతుందని తెలిపారు. అభివృద్ధి కొరకు రోడ్ల విస్తరణకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈక్రమంలోనే హన్మకొండ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించబతున్న భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని సూచించారు. సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
అంతకుముందే ఎంపీ బండి సంజయ్ గజ్వేల్ బీజేపీ కార్యకర్తలను పరామర్శించారు. కార్యకర్తలను కలిసి జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన మాట్లాడుతూ... గజ్వేల్ గొడవల కేసులో కరీంనగర్ జైల్లో ఉన్న 11 మంది నిందితులను కలిశానని చెప్పారు. సీఎం నియోజకవర్గం గజ్వేల్ లో శివాజీ విగ్రహం వద్ద జరిగిన ఘటన గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసున్నారు. ఈ ఘటనను తాను సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే శివాజీ విగ్రహానికి అవమానం జరిగితే తాము చూస్తూ ఊరుకోమన్నారు. శివాజీ విగ్రహం వద్ద మూత్రం పోస్తే లిక్కర్ బాటిల్ ఇస్తామంటూ బెట్టింగ్ కట్టడం దారుణం అన్నారు. అది తప్పు కాదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇక్కడ పార్టీలకు అతీతంగా వ్యతిరేకించాల్సి అవసరం ఉందని చెప్పారు. ఇంత చేసిన వారిని అరెస్ట్ చేయకుండా వీడియో తీసిన వారిని అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. కొందరు కార్యకర్తలపై సోడా బాటిల్స్, బీర్ బాటిల్స్ తో దాడి చేశారని మండిపడ్డారు. కౌన్సిలర్ వెళ్లి గొడవ ఆపే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
అయితే ఈ ఘటనలో ఫిర్యాదు చేసిన వారిపై, గొడవ ఆపేందుకు వెళ్లిన వారిపై కేసులు పెట్టడం ఏంటో పోలీసులకే తెలియాలంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మసీద్ నుంచి రెచ్చగొట్టి గొడవ చేసిన 30 మందిలో కేవలం ఆరుగురిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీ విగ్రహానికి అవమానం జరిగితే చూస్తూ ఊరుకునే స్థితిలో బీజేపీ లేదని వివరించారు. ఈ కేసులో అమాయక ప్రజలపై నాన్ బేయిలబుల్ పెట్టాలని సీఎంఓ నుంచి పోలీసులకు ఒత్తిడి ఉందని ఆరోపించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని బండి సంజయ్ కోరారు.