Peddapalli Lok Sabha Constituency: పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం.. హ్యాట్రిక్ కోసం చూస్తున్న కారు పార్టీకి కలిసి వస్తుందా? పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో అప్రతిహత విజయాన్ని సాధించిన హస్తం పార్టీ హవా కొనసాగుతుందా? పార్టీల గెలుపు అభ్యర్థుల ఎంపికను బట్టి ఉంటుందా? క్షేత్ర స్థాయి బలాల్లో మార్పులు ఏమైనా జరుగుతాయా? అనే ప్రశ్నలపై పార్లమెంట్ పరిధిలో జోరుగా చర్చ సాగుతోంది. ఇంతకీ ఇక్కడ బరిలో దిగే అభ్యర్థులెవరు?  ఈసారి సిట్టింగ్ అభ్యర్థి మారుతాడా? రాజకీయ పార్టీలు చేస్తున్నా వ్యుహలేంటి?


అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో అందరి దృష్టి పార్లమెంట్ ఎలక్షన్స్‌పై పడింది. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న  ఈ నియోజకవర్గంలో రాజకీయంగా, భౌగోళికంగా  వైవిధ్యత కలిగి ఉంది. ఓ వైపు సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ లాంటి పరిశ్రమలు, మరోవైపు వ్యవసాయం ఆధారంగా ఉన్న ఈ నియోజకవర్గంలో రాజకీయంగా ప్రస్తుతం కీలక మార్పులే వచ్చాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ పార్లమెంట్  పరిధిలో బీఆర్‌ఎస్ పార్టీదే హవా కోనసాగింది. ఒక మంథని మినహా అన్ని అసెంబ్లీ స్థానాల్లో కారు పార్టీ ఎమ్మెల్యేలే ఉండేవారు.. దీంతో రెండు సార్లు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ బిఆర్ఎస్ అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించారు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ కంప్లీట్ గా చేంజ్‌ అయింది. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాలను హస్తం పార్టీ హస్తగతం చేసుకుని క్లీన్‌స్వీప్ చేసింది. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో  ఎలాగైనా ఎంపీ సీట్ గెలవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుండగా...  అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్‌ని రిపీట్ చేయాలని అధికార కాంగ్రేస్ భావిస్తోంది. ఇక బిజెపి ఈసారి విన్నర్ గా నిలవాలని బలమైన అభ్యర్థిని బరిలోకి నిలపాలని చూస్తుంది.


పెద్దపల్లి  ఎస్సీ రిజర్వుడు స్థానం కాగా... ఆశావాహులు టిక్కెట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. గత ఎన్నికల్లో బోర్లకుంట వెంకటేష్ నేత ఎంపిగా విజయం సాధించగా... ఈసారి బిఆర్ఎస్ నుంచి ఆయనే బరిలోకి దిగుతారా? మరోకరికి ఛాన్ప్ ఇస్తారా అనే చర్చ సాగుతుంది. బిఆర్ఎస్ తరుపున ధర్మపురి మాజి ఎమ్మెల్యే కోప్పుల ఈశ్వర్,చెన్నుర్ మాజి ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఇద్దరు కోల్ బెల్ట్ ప్రాంతంతో సంబంధాలున్న కావడంతో...ఇద్దరిలో ఎవరికి అదిష్టానం ఛాన్స్ ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. మరోవైపు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బోర్లకుంట వెంకటేష్ నేత కూడా మరోసారి బరిలో ఉంటానని ధీమాగా ఉన్నారట. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పార్టీకి ప్రస్తుతం ఉన్న  ప్రతికూల  పరిస్థితుల  నేపథ్యంలో బలమైన  అభ్యర్థి అయితేనే విజయం సాధించగలమని భావిస్తున్నారట  కారు పార్టీ పెద్దలు. 


అందులో భాగంగానే ధర్మపురితో పాటు రామగుండం,  ఇతర  సింగరేణి ప్రాంతాల్లో ప్రభావం చూపగలిగే  నేత అయిన  కొప్పుల ఈశ్వర్ తాను బరిలో ఉండేందుకు సంకేతాలను పంపారట. మరోవైపు చెన్నూర్ మాజీ  ఎమ్మెల్యే బాల్క సుమన్‌ కూడా తన ప్రయత్నాలను ప్రారంభించారట.  ఇద్దరు నేతలు కూడా మాల సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఇక్కడ  గణనీయమైన  సంఖ్యలో ఉన్న నేతకాని సామాజిక వర్గానికి చెందిన తనకు మరోసారి టికెట్ వస్తుందని అంచనాల్లో ఉన్నరట సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత.


అధికార కాంగ్రెస్ పార్టీలోను ఆశావాహుల సంఖ్య పెరిగిందట. చెన్నుర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తన వారసుడిగా వంశీక్రిష్ణను బరిలో నిలపాలని చూస్తున్నారట. గతంలో వివేక్ తో పాటుగా ఆయన తండ్రి వెంకటస్వామి పెద్దపల్లి ఎంపిగా రాణించారు. అయితే వారి వారసుడిగా వంశీక్రిష్ణను తీసుకురావాలనేది వివేక్ కుటుంబ సభ్యుల ఆలోచనగా తెలుస్తుంది. ఇక చెన్నూర్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన మాజీ  ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు ఎంపీ టికెట్ ఇస్తారన అప్పట్లో ప్రచారం సాగింది. ఆయన  కూడా వివేక్ గెలుపు కోసం కృషిచేసారు. తాజాగా వంశీ పేరు ప్రచారం అవుతుండటం ఆసక్తిగా మారింది.  ఇప్పటికే ఆ కుటుంబం నుంచి ఇదే పార్లమెంట్ పరిధిలో అన్నదమ్ములైన వివేక్, వినోద్ లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎంపీ టికెట్ కూడా ఆ  ఫ్యామిలీకి ఇస్తారా? మరోకరికి ఛాన్ప్ ఇస్తారా అనేది వేచి చూడాలి.


ఇక బీజేపీ సైతం అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతుంది. ఒక్కసారైన పార్లమెంట్ సెగ్మెంట్ పై కాషాయం జెండా ఎగరవేయాలనేది ఆ పార్టీ నేతల టార్గెట్ గా తెలుస్తుంది. బీజేపీ నుంచి ధర్మపురి నుంచి పోటీ చేసిన ఓటమి పాలయిన ఎస్‌.కుమార్, మాజీ  ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య ఆశావాహుల లిస్టులో ఉన్నారు. వీరిలో పార్టీ సీనియర్ గా ఉన్న కాసీపేట లింగయ్య వైపు అధిష్టానం మొగ్గు చూపుతుందా? సంఘ్ నేతల మద్దతున్న ఎస్.కుమార్ మరోసారి పెద్దపల్లి బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతుంది. 


పెద్దపల్లిలో ఈసారి ఎంపీ సీటు కైవసం చేసుకునేందుకు మూడు పార్టీలు తలపడనున్నాయి. అయితే బలమైన అభ్యర్థులను బరిలో నిలుపేందుకు అభ్యర్థుల బలాబలాలను అంచనా వేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో భిన్నమైన తీర్పునిచ్చిన కార్మికలోకం రాబోయే ఎన్నికల్లో ఎలాంటి తీర్పునిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.