Sons Left Their Mother on Road in Karimnagar: అమ్మ.. ఈ సృష్టిలో గొప్ప పదం. తన బిడ్డల ఎదుగుదల కోసం అహర్నిశలు శ్రమించి , నిరంతరం వారి బాగు కోసమే ప్రతీ తల్లి పరితపిస్తుంది. అలాంటి మాతృమూర్తులను కొందరు ప్రబుద్ధులు వృద్ధాప్య దశలో నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. నవ మాసాలు మోసి పురిటి నొప్పులను భరించి తమకు జన్మనిచ్చిన తల్లినే పోషించలేమంటూ అనాథలా వీధుల పాలు చేస్తున్నారు. దీంతో వృద్ధాప్య దశలో మనవలు, మనవరాళ్లు, కుటుంబంతో సంతోషంగా గడపాల్సిన ఎందరో మాతృమూర్తులు బుక్కెడు బువ్వ కోసం ఆర్తిగా ఎదురు చూసే పరిస్థితి నేడు సమాజంలో కనిపిస్తోంది. తాజాగా, కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ఓ 80 ఏళ్ల వృద్ధురాలిని కుమారుడు పట్టించుకోకుండా నడిరోడ్డుపై అలానే వదిలేశాడు.  


పూర్తి వివరాలివే


కరీంనగర్ జిల్లా శంకరపట్నం (Shankarapatnam) మండలం తాడిపల్ (Tadipal) గ్రామానికి చెందిన బొల్లం ఎల్లమ్మకు నలుగురు సంతానం. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎల్లమ్మ భర్త వీరమల్లు అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. పెద్ద కొడుకు, చిన్న కుమార్తె కూడా అనారోగ్యంతో ఇటీవలే మరణించారు. ప్రస్తుతం ఆమెకు చిన్న కుమారుడు బొల్లం సాంబయ్య, పెద్ద కూతురు ఉన్నారు. కాగా, వృద్ధురాలు ఎల్లమ్మ గ్రామంలోని చిన్న కుమారుడు వద్ద కొంత కాలం, పెద్ద కుమారుడి కుటుంబం కొంత కాలం చూసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎల్లమ్మ పెద్ద కుమారుడు రాజయ్య కుటుంబ సభ్యులు మహారాష్ట్రలో నివాసం ఉంటున్నారు. వారి వంతు ప్రకారం ఆమెను చూసుకున్నారు. తమ వంతు ముగిసిన అనంతరం మహారాష్ట్రలో ఉండే పెద్ద కోడలు వృద్ధురాలిని తీసుకొచ్చి చిన్న కుమారుడి ఇంటి వద్ద వదిలేశారు. ఆమెకు తన మరిదితో మాటలు లేకపోవడంతో స్థానికంగా ఉండే పెద్ద మనుషులకు చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, వృద్ధురాలిని చిన్న కుమారుడి కుటుంబ సభ్యులు ఇంట్లోకి తీసుకెళ్లకుండా ఆటోలో పాత ఇంటి సమీపంలో రోడ్డు పక్కన దించేసి వెళ్లిపోయారు. 


వెల్ఫేర్ కమిటీ ఆరా


రోడ్డు పక్కన ఉన్న వృద్ధురాలి పరిస్థితి చూసి చలించిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని, పూర్తి విషయం తెలుసుకుని చిన్న కుమారుడు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అయినా, వారు వృద్ధురాలిని ఇంట్లోకి తీసుకెళ్లేందుకు నిరాకరించారు. దీంతో స్థానికులే ఆమెను శిథిలావస్థలో ఉన్న పెద్ద కుమారుడి ఇంట్లో ఉంచారు. రాత్రంతా చీకట్లో ఆమె బిక్కుబిక్కు మంటూ కాలం గడిపినట్లు చెప్పారు. అయితే, రాత్రి చిన్న కుమారుడు తల్లికి భోజనం తెచ్చాడని, ఆ శిథిల ఇంట్లోనే ఉంచి భోజనం పెడతానని అతను చెప్పినట్లు స్థానికులు పేర్కొన్నారు. 80 ఏళ్ల వృద్ధురాలికి ఈ పరిస్థితి రావడం బాధాకరమని, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. మరోవైపు, ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లగా, ఉమెన్ వెల్ఫేర్ కమిటీ అధికారులను గ్రామానికి పంపి విచారణకు ఆదేశించారు. అయితే, ప్రస్తుతం వృద్ధురాలిని ఎవరు చూసుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది.


Also Read: Revanth Reddy : ఆటోడ్రైవర్లు, గిగ్ వర్కర్ల సమస్యలపై రేవంత్ రెడ్డి దృష్టి - ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రత్యేక సమావేశం !