హీరో ఆదిత్య ఓం గుర్తు ఉన్నారా? నందమూరి హరికృష్ణ హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాలో ఓ రోల్ చేశారు. ఆ తర్వాత 'ధనలక్ష్మి ఐ లవ్ యు', 'ఒట్టు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు', 'ప్రేమిచుకున్నాం పెళ్ళికి రండి' తదితర సినిమాల్లో హీరోగా నటించారు. 'మా అన్నయ్య బంగారం' సినిమాలో రాజశేఖర్ తమ్ముడిగా కనిపించారు. కారణాలు ఏమిటి? అనేది పక్కన పెడితే... హీరోగా ఆదిత్య ఓం కెరీర్ నెమ్మదించిన మాట వాస్తవం. ఇప్పుడు మళ్ళీ హీరోగా నిలబడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ఓ ప్రయోగాత్మక సినిమా చేశారు. 


సింగిల్ క్యారెక్టర్... బందీ! 
Aditya Om's Bandi Movie: ఆదిత్య ఓం కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'బందీ'. దీని ప్రత్యేకత ఏమిటంటే... సినిమా అంతా స్క్రీన్ మీద ఒకే ఒక్క క్యారెక్టర్ కనబడుతుంది. తెలుగులో సింగిల్ క్యారెక్టర్ సినిమాలు అరుదు. అందులో ఆదిత్య ఓం సినిమా ఒకటిగా నిలవనుంది. దీనికి తిరుమల రఘు దర్శకత్వం వహిస్తున్నారు. తిరుపతి పొన్నాల గల్లీ సినిమా పతాకం మీద వెంకటేశ్వర రావు దగ్గుతో కలిసి దర్శకుడు తిరుమల రఘు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఆదిత్య ఓం కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. 


ఒక్క మాట లేదు... అంతా ఎమోషన్!
Bandi movie trailer review: 'బందీ' సినిమా ట్రైలర్ చూస్తే... ప్రాణం కోసం మనిషి చేసే పోరాటాన్ని చూపించారు. 'జీవితం అనేది ఓ పరుగు... ఆహారం కోసం, నీరు కోసం, డబ్బు కోసం, స్వాతంత్య్రం కోసం, కోరికల కోసం' అని ట్రైలర్ మధ్య మధ్యలో సినిమా కాన్సెప్ట్ చెప్పే ప్రయత్నం చేశారు.


ఓ అడవిలో ఆహరం కోసం ఆదిత్య ఓం పరుగులు తీయడం కనిపించింది. చివరకు చీమల్ని తిన్నట్టు చూపించారు. ప్రాణాల కోసం పరుగులు తీసినట్టు చూపించారు. ట్రైలర్ చివర్లో ఆయన ఒంటి మీద నూలు పోగు లేకుండా కనిపించారు. ప్రజెంట్ ఈ ట్రైలర్ సినిమా సర్కిల్స్‌లో డిస్కషన్ పాయింట్ అయ్యింది.


Also Read: యాంకర్ సుమ కొడుకు సినిమా పెద్దలకు మాత్రమే



'బందీ' ట్రైలర్ విడుదలైన తర్వాత దర్శకుడు తిరుమల రఘు మాట్లాడుతూ ''మా సినిమాలో ఒక్కటే క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించినప్పటికీ... సినిమా చూసే ప్రేక్షకులకు ఆ విషయం అసలు గుర్తు ఉండదు. ప్రకృతి మనకు ఎంత ముఖ్యం అనేది వివరిస్తూ గాలి, నీరు, వాతావరణం ప్రాముఖ్యతను చెబుతూ తీసిన చిత్రమిది. మన దేశంలోని పలు అటవీ ప్రాంతాల్లో చిత్రీకరణ చేశాం. ఇందులో ఆదిత్య ఓం ఎలాంటి డూప్ లేకుండా అన్ని రకాల స్టంట్స్ చేశారు. మూడేళ్లు మా సినిమా కష్టపడ్డారు. మూడేళ్ళ పాటు ఏడాదిలో ఉండే అన్ని రుతువులు కవర్ చేస్తూ సినిమా తీశాం. పర్యావరణ సంరక్షణ మీద తీసిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది'' అని చెప్పారు. 


Also Readఛాంబర్‌లో 'దిల్' రాజు దగ్గర సంక్రాంతి సినిమాల పంచాయతీ - డుమ్మా కొట్టిన 'హనుమాన్' నిర్మాత


  
ఆదిత్య ఓం నటించిన ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: గల్లీ సినిమా, సంగీతం: వీరల్, లవన్, సుదేష్ సావంత్, ఛాయాగ్రహణం: మధుసూధన్ కోట, కూర్పు: ప్రకాష్ ఝా, నిర్మాతలు : తిరుమల రఘు - వెంకటేశ్వర రావు, కథ - స్క్రీన్ ప్లే:  ఆదిత్య ఓం, దర్శకుడు: తిరుమల రఘు.