Ex MLA Vijaya Ramanarao Arrest: పెద్దపల్లిలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారం నేతల మధ్య వైరాన్ని పెంచుతోంది. ఈ ఇసుక స్మగ్లింగ్ పై ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య కొన్ని రోజులుగా ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగించడంతో వ్యవహారం మరింత హీటెక్కింది. నువ్వు ఇసుకను అక్రమంగా రవాణా చేశావంటే.. కాదు నువ్వు, నీ బినామీలు చేస్తున్నారని మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ విభేధాలే ఇప్పుడు తారస్థాయికి చేరాయి. 


సవాళ్లు, ప్రతిసవాళ్లు.. 
పెద్దపల్లి నియోజకవర్గంలోని మానేరు వాగుపై ఇటీవల ఇసుక రీచ్ లు ప్రారంభం అయ్యయి. అయితే ఇసుక కాంట్రాక్టర్ల వద్ద ప్రస్తుతం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని.. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్య విజయ రమణా రావు ఆరోపణలు చేస్తునారు. ఆయన నిజంగానే ఇసుక రీచ్ ల కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు తీసుకోకపోతే.. దమ్ముంటే మల్లికార్జున స్వామి వద్ద ప్రమాణం చేయాలని మాజీ ఎమ్మెల్యే విజయ రమణా రావు సవాల్ చేశారు. 


మాజీ ఎమ్మెల్యే అరెస్టు, ఎమ్మెల్యే గృహ నిర్బంధం 
నేను వారి వద్ద నుండి ఎలాంటి ముడుపులు తీసుకోలేదని ప్రమాణం చేస్తున్నా అంటూ.. ఆలయం వద్ద దేవుడి చిత్ర పటం పట్టుకుని ప్రమాణం చేసేందుకు వచ్చారు. తన అనుచరులతో పాటు మల్లికార్జున స్వామి ఆలయం వద్దకు రాగా... అప్పటికే అక్కడికి వచ్చిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే విజయ రమణా రావు సహా ఆయన అనుచరులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం విజయ రమణా రావును పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్కడి నుండి తరలించారు. దాంతో అక్కడ ఉద్రిక్తత సద్దుమణిగింది.


సవాళ్ల రాజకీయం


మరో వైపు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఉద్రిక్తత నెలకొంటుందన్న ముందస్తు సమాచారంతో పోలీసులు తగు చర్యలు చేపట్టారు.  మాజీ ఎమ్మెల్యే విజయ రమణా రావు ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలన్న సవాల్ మేరకు.. అక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ జరిగే అవకాశాలు ఉండటంతో.. ఆదివారం తెల్లవారుజామున పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. ఓదెల మల్లన్న దేవాలయానికి ముఖ్య నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వెళ్లగా... ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వేలాది మంది పార్టీ నాయకులతో ఓదెల వెళ్లాలని సిద్ధం అయ్యారు. 


మాజీ ఎమ్మెల్యే ఆరోపణలపై ప్రస్తుతం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మొనగాడివి అయితే డబ్బులు తీసుకున్నట్లు నిరూపించాలని, ఎవరు సాయం చేస్తారో, ఎవరు దోచుకుంటారో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు అంటూ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా ఎమ్మెల్యేను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పెద్దపల్లిలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉండేందుకు పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి ఆధ్వర్యంలో సీఐలు ఇంద్ర సేనారెడ్డి, ప్రదీప్ కుమార్ తో పాటు ఎస్ఐలు బందోబస్తులో పాల్గొన్నారు.