NTPC Raising Day 2022: దేశంలోని అత్యుత్తమ 50 కంపెనీలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తోంది. నవరత్న కంపెనీ నుంచి మహారత్న కంపెనీగా రూపాంతరం చెందిన రామగుండంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ 47 వసంతాలు పూర్తి చేసుకుంది. భారతదేశానికే వన్నె తెస్తున్న ఈ సంస్థ ప్రస్థానం అనేక రికార్డులను తిరగరాస్తు వస్తోంది. దేశంలో 77 విద్యుత్ కేంద్రాల ద్వారా 70,254 మెగావాట్ల కరెంటుని ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా 2032 నాటికి 1,28,000 మెగావాట్ల లక్ష్యంతో సరికొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తూ దూసుకెళ్తోంది.


అలా మొదలైంది ...


దేశంలో తీవ్ర విద్యుత్ కొరత ఉన్న సమయంలో కేంద్రం పరిధిలోనే ఒక విద్యుత్ కేంద్రం ఉండాలని అప్పటి ప్రభుత్వం ఎన్టీపీసీకి అంకురార్పణ చేసింది. విద్యుత్తు ప్రాజెక్టుతోపాటు పంపిణీ సైతం పారదర్శకంగా ఉండాలని ఆలోచనతో విద్యుత్ కేంద్రం ఉన్న రాష్ట్రానికి మెజారిటీ వాటా కేటాయించి మిగులు విద్యుత్‌ను ప్రాంతాలవారీగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. మరోవైపు 1975 నవంబర్ 7న ఎన్టీపీసీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ గా నమోదు చేసుకొని కార్యకలాపాలు ప్రారంభించింది. దేశంలో బొగ్గు గనులు, నీరు, గ్యాస్, స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాలను గుర్తించడంతోపాటు వాటిని సమన్వయం చేస్తూ ప్రపంచ స్థాయి కంపెనీలతో పోటీ పడుతోంది. మరోవైపు పవర్ ప్లాంట్ సామర్ధ్యాన్ని క్రమక్రమంగా పెంచుతూనే మెయింటెనెన్స్, రక్షణ విద్యుత్ ఆదా, పర్యావరణ సమతుల్యం, ఇతర మేనేజ్మెంట్ విధానాలతో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. సొంతంగా బొగ్గు గ్యాస్, హైడ్రో, సోలార్, ఫ్లోటింగ్ సోలార్ జాయింట్ వెంచర్ల తో పాటు మొత్తం 77 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను కలిగి ఉంది. మరోవైపు సూపర్ క్రిటికల్ మెగా ప్రాజెక్టులకు సైతం ప్రణాళికలు రచిస్తోంది. 


దేశానికి వెలుగు దివ్వెలా మారిన ఎన్టీపీసీ..


ఇక కేవలం విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే ఒకప్పుడు పరిమితమైన ఎన్టీపీసీ పంపిణీ, విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు.. సొంత బొగ్గు గనుల ఏర్పాటు, జాయింట్ వెంచర్లను కూడా ప్రారంభిస్తూ దేశంలోనే అతిపెద్ద సంస్థగా ఎదిగింది. ఇక దేశం వెలుపల భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లలో కూడా విద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఆయా దేశాల్లో అంది వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ బ్రాండ్ కి మరో పేరుగా నిలుస్తోంది. ఒకప్పుడు విద్యుత్ కొరతతో ఇబ్బందులుపడ్డ దేశ ప్రజానీకానికి ఎన్టీపీసీ వెలుగు దివ్వెలా మారింది. 2032 నాటికి శిలాజ ఇంధనాల ద్వారా చేసే విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎన్టీపీసీ పోర్టు ఫోలియోలో 30% గా ఉంటుంది. జాతీయ సామర్థ్యంతో పోలిస్తే ఇది 16.78 శాతం ఉంది. 


దేశంలోని ప్రైవేట్ కంపెనీలతో పోల్చిన ఎన్టీపీసీలో ఉద్యోగం సాధించడం గౌరవప్రదంగా భావిస్తారు. అటు వనరులను సరిగ్గా వినియోగించుకుంటూనే సరైన ప్రణాళికలతో ఎన్టీపీసీ అంతర్జాతీయంగా విస్తరిస్తూ పలు రంగాల్లో తనదైన ముద్ర వేస్తోంది. రామగుండంలో నీటిపై ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ సోలార్ ప్యానల్స్ రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తూ ఆల్టర్నేటివ్ ఎనర్జీ పై ఎన్టీపీసీకి ఉన్న లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని విభిన్నమైన ప్రాజెక్టులను ప్రారంభించి విద్యుత్ రంగంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఎన్టీపీసీ యజమాన్యం భావిస్తోంది.