Theft Cases in Vemulawada Rajanna Temple: దక్షిణ కాశీగా పేరొందిన సిరిసిల్లలోని వేములవాడ (Vemulawada) పుణ్యక్షేత్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. రాజరాజేశ్వర స్వామి దర్శనార్థం వస్తున్న భక్తుల కాంప్లెక్స్ వసతి గదుల్లోకి చొరబడి మరీ చోరీలు చేస్తున్నారు. జాతర గ్రౌండ్ ప్రాంతంలోని నందీశ్వర కాంప్లెక్స్ వసతి గదుల్లో చోటుచేసుకున్న ఈ చోరీకి సంబంధించి అటు భక్తులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన ఎర్రవెల్లి గణేష్, వరంగల్ (Warangal) కు చెందిన తాడూరు విశ్వనాథం అనే యాత్రికులు రాజన్న దర్శనం కోసం శనివారం రాత్రి వేములవాడ (Vemulawada) నందీశ్వర కాంప్లెక్స్ లో వసతి గదులను అద్దెకు తీసుకున్నారు. పూర్తిస్థాయిలో భద్రత ఉందని భావించిన వీరు స్వామి దర్శనం కోసం ఆదివారం ఉదయం గదులకు తాళం వేసి వెళ్లారు. 


గణేష్ కి మూడవ నంబరు సూట్ రూమ్ కేటాయించగా విశ్వనాథం 156వ నంబర్ గల గదిలో తమ సామాన్లను ఉంచి దర్శనం కోసం వెళ్లారు. అయితే తిరిగి వచ్చేసరికి ఈ రెండు గదుల తాళాలు పగలగొట్టి ఉండడం గమనించిన వీరు దీనికి సంబంధించి ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు. తమ సెల్ ఫోన్లు నగదు చోరీ అయ్యాయని ఫిర్యాదు చేశారు. మరోవైపు పూర్తిస్థాయిలో భద్రత ఉందనుకున్న వీరు సీసీటీవీ కెమెరాలు ఫుటేజ్ ని పరిశీలించాలని ఆలయ సిబ్బందిని కోరారు. అయితే వారి నుండి ఊహించని స్పందన ఎదురైంది. ఏ మాత్రం పట్టించుకోని ఆలయ సిబ్బంది వైఖరి పట్ల భక్తులు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో వారితో వాగ్వివాదానికి దిగారు. ఒక దశలో ఆలయ సిబ్బంది ఫోన్లను లాక్కోవడంతో పాటు వారిపై దాడికి కూడా దిగడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆలయ పీఆర్ఓ, ఇద్దరు ఏఈవోలు అక్కడికి చేరుకొని వారిని శాంతింప చేశారు. 


మొత్తం ఎనిమిది సెల్ ఫోన్లు, 20 వేలకు పైగా నగదు చోరీకి గురైందని, దీనికి బాధ్యులు ఎవరని భక్తులు ఆలయ అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలికి చిలికి గాలి వానలా మారిన ఈ గొడవతో అక్కడ కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని.. కనీసం సీసీటీవీ ఫుటేజ్ లను సైతం పరిశీలించకుండా తాత్సారం చేశారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎంతో దూరం నుండి రాజన్న దర్శనానికి వస్తే ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని వారు వాపోయారు.


దీంతో ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. పట్టణ సీఐ వెంకటేష్ ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తానని భక్తులకు హామీ ఇవ్వడంతో పాటు వారి సొమ్ము వెనక్కి వచ్చేలా దొంగలను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే ఇంత కీలకమైన పుణ్యక్షేత్రానికి కనీస భద్రత సౌకర్యాలు లేకపోవడం పట్ల అంతట ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.