మునుగోడు ఉప ఎన్నికల హడావుడి ముగిసింది. అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉప ఎన్నిక వేడిని రాష్ట్రమంతటా పెంచాయి. మునుగోడు ఫలితాలు వచ్చాక అంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై తమ వ్యూహాలకు పదునుపెట్టనున్నారు. అయితే సాధారణ ఎన్నికల కంటే ముందే తెలంగాణలో మరో ఉప ఎన్నిక వస్తుందని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చ నడుస్తోంది.
పౌరసత్వం రద్దయితే ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు !
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో హుజరాబాద్ ఉప ఎన్నిక ద్వారా ఈటల రాజేందర్ బిజెపికి ప్రాతినిధ్యం వహిస్తుండగా మంథని నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక జిల్లావ్యాప్తంగా అధికార టీఆర్ఎస్‌దే మెజారిటీ అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాలో మరోసారి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తన పదవిలో కొనసాగడానికి అనర్హుడని.. జర్మనీ పౌరసత్వాన్ని ఇంకా వదులుకోలేదని ఇప్పటికే తీర్పు రిజర్వులో ఉంది. 2019లో తన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ జారీ చేయగా దానిని సవాల్ చేస్తూ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఇప్పటికే నాలుగో సారి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 


రెండు చోట్ల పౌరసత్వం కుదరదని.. కేంద్రం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ రెడ్డి వాదించారు. ఒకటి పౌరసత్వ చట్టంలోని సెక్షన్ పది ప్రకారం, మరొకటి సెక్షన్ సెవెన్ బి కింద ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా హోదా కలిగి ఉన్నారని పేర్కొన్నారు. అయితే ఇలా రెండు రకాల పౌరసత్వాన్ని కలిగి ఉండడం చట్ట ప్రకారం కుదరదని ధర్మసరానికి ఆయన వివరించారు. అయితే కేంద్రం దీనికి సంబంధించి ఎమ్మెల్యేగా చిన్నమనేని రమేష్ కొనసాగడం ప్రజా ప్రయోజనాలకు అనుకూలం కాదంటూ వాదించింది. ఇప్పటికే ఏదో ఒక దానిని వదులుకోవాల్సి ఉండగా రెండింటినీ కొనసాగడం కుదరదని స్పష్టం చేసింది. 


ఈ పిటిషన్ కి సంబంధించి మొదటి నుండి పోరాడుతున్న కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ తన న్యాయవాది రవికిరణ్ ద్వారా వాదనలు వినిపించారు చెన్నమనేని రమేష్ ఎమ్మెల్యే పదవిలో కొనసాగడానికి వాస్తవాలను దాచి ఉంచారని వినిపించారు. మరోవైపు తప్పుడు సమాచారంతో పరసత్వం పొందడానికి సంబంధించిన రికార్డులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇప్పటికే ఉన్నాయని తెలిపారు కేంద్రం బలంగా వాదనలు వినిపించడంతో చివరికి తీర్పు రిజర్వు అయింది. ఒకవేళ ఈ తీర్పు గనుక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వచ్చినట్లయితే సాధారణ ఎన్నికల కంటే ముందే మరోసారి వేములవాడ ఉప ఎన్నికల కేంద్రం కానుంది.


ఆ ఎమ్మెల్యే రాజీనామా చేస్తారా?
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు అత్యంత సన్నిహితుడుగా పేరుందిన మరో కీలక ఎమ్మెల్యే ఉప ఎన్నికల కంటే ముందే రాజీనామా చేస్తాడా? అనే గుసగుసలు సైతం వినిపించాయి తనకు పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవడంతో పాటు మొదటి నుండి అనుమానిస్తున్నారని.. మరో ఉప ఎన్నిక కు కారణం అవుతారనే ప్రచారం కొనసాగింది. అయితే ఇప్పటికీ బీజేపీ పార్టీలోని కీలక నేతలతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలోనూ... ఆ తరువాత కీలకమైన పదవి పొందడంలోనూ ఈటల రాజేందర్ తో ఉన్న రాజకీయ అనుబంధమే కారణమని తనకు ఓనమాలు నేర్పిన రాజేందర్ తో పాటే రాజీనామా చేస్తాడని భావించినా అప్పట్లో కాస్త వెనుకడుగు వేసినట్లు ప్రచారం జరిగింది. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాంటి బాధ్యతలు ఇవ్వకపోవడంతో పాటు కాస్త ప్రాధాన్యత తగ్గించడంతో ఆ ఎమ్మెల్యే ఇప్పటివరకూ ఏ నిర్ణయం తీసుకోలేకపోయినట్లు సమాచారం. అయితే తనకు తగ్గ స్థాయిలో వేరే నేత నియోజకవర్గంలో లేకపోవడంతో ఎందుకు రిస్క్ చేయడం అని వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది.. ఏదేమైనా పరిస్థితులు మళ్లీ మారితే ఉమ్మడి కరీంనగర్ మరో ఉప ఎన్నికకు కేంద్రం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.