కరీంనగర్ పట్టణం గతంతో పోలిస్తే విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతోంది. అందుకే పెరుగుతున్న విస్తీర్ణానికి అనుగుణంగా భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చేందుకు కొత్త విధానం తీసుకొచ్చారు. ఇప్పుడు ఆవిధానమే తీవ్ర విమర్శల పాలవుతోంది. డబ్బులు ఇచ్చిన వారికే అధికారులు అనుమతి ఇస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక డివిజన్‌కు చెందిన ఒకరు టీఎస్ బీపాస్ ద్వారా భవన అనుమతికి దరఖాస్తు చేశారు. పైస్థాయిలో పరిశీలిస్తే ఆ స్థలానికి సంబంధించి వివరాలు తెలిసిపోతాయి. అలా కాకుండా ఎన్వోసీ లేదని పేర్కొంటూ అధికారులు తిరస్కరించారు. నాలుగైదుసార్లు వారిచుట్టూ తిరిగిన అనుమతి రాలేదు. చివరకు వేరే మార్గంలో వెళ్తే మాత్రం ఇట్టే అనుమతి వచ్చింది.
మరొక డివిజన్‌కు చెందిన స్థల యజమాని జీ+3 అంతస్తులు సింగిల్ విండో ద్వారా దరఖాస్తు చేశారు. చివరి వరకు పెండింగ్ పెట్టి అనుమతి ఇచ్చారు. ఎందుకు ఆలస్యం అయిందని అధికారులను అడిగితే వారి దగ్గర సమాధానం లేదు. కరీంనగర్ నగర పాలక సంస్థతోపాటు మున్సిపాలిటీలో భవన అనుమతులు తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆన్లైన్ దరఖాస్తు చేసినప్పటి నుంచి మొదలవుతున్న ఇబ్బందులు ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు పడాల్సిందే. అన్నీ సక్రమంగా ఉన్న క్షేత్రస్థాయిలో తనిఖీ చేసే అధికారుల నుంచి మొదలుకొని పట్టణ ప్రణాళిక అధికారుల వరకు అనుసరిస్తున్న తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లకు కూడా రెవెన్యూ అధికారుల నుంచి ఎన్వోసి తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారు. నాలుగైదు రోజుల కిందట అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక విభాగంపై నగరపాలక కమిషనర్ సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు వేగవంతమైన సేవలను అందించేందుకు వీలుగా ప్రభుత్వం టీఎస్బీపాస్ ప్రవేశపెట్టింది. ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో ఆమోదం అయ్యేలా చర్యలు చేపట్టారు. దాని ప్రకారం దరఖాస్తుల్లో వివరాలన్నీ పరిశీలించి వచ్చిన దరఖాస్తులు వచ్చినట్లు అప్రూవల్ ఇవ్వకుండా ఆపుతున్నారు. చివరికి రెడ్ మార్క్ వచ్చిన తర్వాత ఏదో ఒక వంక పెట్టడం, గత్యంతరం లేక పోతే చివరిరోజు అనుమతి జారీ చేయడం వంటివి చేస్తున్నట్లుగా కొందరు సభ్యులు ఓపెన్‌గా అందరిముందే చెప్తున్నారు. పైగా తిరస్కరించే దరఖాస్తుకు సరైన సమాచారం ఇవ్వకుండా దాటవేస్తున్నట్టు తెలుస్తోంది.
నగర పరిధిలోని పలు డివిజన్ల నుంచి కంప్లైంట్స్ అధికమయ్యాయి. సెట్ బ్యాక్ పాటించడం లేదని అనుమతులు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు చేస్తున్నారని పలువురు రాతపూర్వకంగా ఇచ్చినప్పటికీ ఆ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇలాంటి వాటిపై పట్టింపు లేకుండా వ్యవహరించడమే కాకుండా ఒకరిద్దరు పట్టణ ప్రణాళిక ఉద్యోగులు అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లినట్టు వినికిడి.
భవన నిర్మాణ సమయంలో అనుకూలంగా వ్యవహరిస్తే చాలు కట్టడి చేసేందుకే రావడం లేదంటున్నారు. ఒత్తిడి తెస్తే నోటీసు ఇచ్చామని టాస్క్ఫోర్స్ చర్యలు తీసుకుంటుందని దాటేసే ధోరణిలో ఉంటున్నారట. నగరంలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయన్నది అందరూ చెప్తున్న మాట. దరఖాస్తు చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణాలు చేస్తూ నగరసంస్థ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఉరి చివరి ప్రాంతాల్లో ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి. లేఅవుట్ లేని స్థలాలు ట్యాంక్ ప్రాంతాల్లో అనుమతులు జారీ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కొందరు ప్రజాప్రతినిధులు అడ్డుగా ఉండడంతో అధికారులు సైతం అలాగే పట్టించుకోకుండా ఉంటున్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం వస్తే చాలు ఆఫీసు చుట్టూ తిప్పుకుంటున్నారు.