Narayanpur reservoir: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులకు, వంకలన్నీ పొంగి పొర్లుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లన్నీ నిండు కుండల్లా మారాయి. అయితే జివ్లాలో అన్నిటికన్నా పెద్దదయిన నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తిగా నిండిపోయింది. ఇప్పటికీ వరద నీరు ఉద్ధృతంగా పోటెత్తుతుతోంది. అంతే కాకుండా ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుండి భారీ ఎత్తున నీరు వస్తుండటంతో నీళ్లు చెరువు మత్తడి దూకాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో నీటి పారుదల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో చెరువుకు గండి కొట్టారు. దీంతో వరద నీరు దిగువ ప్రాంతాల్లో చేరింది. చాలా గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి.  


పునరావాసాన్ని కల్పించాలి..


వందలాది గ్రామాల్లోని ఇళ్లన్నీ నీటమునిగాయి. లక్షల్లో ఆస్తి నష్టాన్ని కల్గింది. అయితే వెంనటే అప్రమత్తమైన అధికారులు ముంపు గ్రామాల ప్రజలను పునవారాస కేంద్రాలకు తరలించారు. భోజనంతో పాటు వసతిని కూడా కల్పించారు. అయితే ఇదంతా జరిగి రోజులు గడుస్తున్నా తమకు ఎలాంటి నష్ట పరిహారం లభించలేదని... ఇక తమ గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల బాధితులు అంతా కలెక్టరేట్ వద్దకు చేరుకొని మంగళ వారం సాయంత్రం వరకు ధర్నా చేశారు. నాలుగు గ్రామాల నుండి ట్రాక్టర్ల పై వచ్చిన వారంతా కలెక్టర్ కి తమ బాధలు విన్నవించుకుంటూ లేఖ రాశారు. 


హామీ ఇచ్చి ఏళ్ల గడుస్తోంది..


మరోవైపు 11 ఏళ్ల కిందట ‌‌ఎల్లంపల్లి  ఫేస్ 1,  ఫేస్ 2 కింద రిజర్వాయర్ కోసం భూసేకరణ చేశారని.. అప్పట్లోనే ఇళ్లకు నష్ట పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చారని గ్రామస్థులు చెబుతున్నారు. సర్కారు హామీ కేవలం మాటలకు మాత్రమే పరిమితం అయిందని వాపోయారు. ఏళ్లు గడుస్తున్నా ఏ ఒక్క నాయకుడు ఆ హామీ గురించి మాట్లాడలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు 7 సంవత్సరాలుగా ఎలాంటి పరిహారం ఇవ్వకుండా రిజర్వాయర్ పూర్తిగా నిండేలా చేస్తున్నారని... దీంతో ప్రతీ వర్షా కాలంలోనూ నీరు నివాస ప్రాంతాలలోకి వచ్చి చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని వివరించారు. నీటితో పాటు పాములు, తేల్లు ఇతర విష పురుగులు చేరి భయంకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయని ముంపు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


న్యాయం చేయాలంటూ ఆందోళన..


ఇప్పటికైనా తమ సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకొని తమ ఊళ్లను ముంపు గ్రామాలుగా ప్రకటించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన విషయాన్నంతా ఓ లేఖలో రాశి దాన్ని కలెక్టర్ కు కూడా అందజేశారు. స్పందించిన కలెక్టర్ త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ హామీతో ముంపు గ్రామాల ప్రజలు ధర్నాను ఆపేశారు. మరోవైపు ధర్నాకి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ సంఘీభావం తెలిపారు. మొత్తానికి తమ గ్రామాల సమస్య పరిష్కారానికి అధికారులు, నాయకులు ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి.. సమస్య తీరిస్తే చాలని చెబుతున్నారు. మరి ఏం జరగనుందో చూడాలి.