తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకోనుంది. స్వరాష్ట్రంలో సాధించిన విజయాలు చాలానే ఉన్నాయి. దశాబ్ధి ఉత్సవాల పేరిట వేడుకలు జరిపేందుకు ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఓ ఊరు మాత్రం ముందుగానే సంబురాలు షురూ అయ్యాయి. పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా గ్రామంలో ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన నిధులతో మంచి ఫలితాలు సాధించడమే కాదు వాటిని కృతజ్ఞత చెప్పడం కూడా ముఖ్యమే అంటున్నారు అక్కడి ప్రజలు.
తెలంగాణ రాష్ట్ర సాకారమై స్వరాష్ట్ర పాలనలో సాధించిన విజయాలతో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు గ్రామస్థులు. పొలాల్లో ఊరి పొలిమేరల్లో హోర్డింగ్స్ పెట్టారు. పదేళ్ల పాలనలో సాధించిన విజయాలు అంటూ సందేశం ఇస్తున్నారు.
నాటి పాలనలో ఉన్న తీరును, నేటి పాలనలో ఉన్న పరిస్థితిని వివరిస్తూ తేడా క్లియర్‌గా తెలిసేలా ఫ్లెక్సీలు పెట్టారు. అందులోనే ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రైతు బంధు ద్వార మంచి ఫలితాలు సాధించామంటున్నారు. నాడు తాగు నీటి కోసం కిలోమీటర్లు నడిచి వెళ్లి నీళ్లు తెచ్చుకునే వాళ్లమని నేడు ఇంటికే కుళాయి నీళ్లు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.
చెరువులకు పునర్జీవనం వచ్చి పల్లెలు జీవం పోసుకున్నాయని కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముఖరా పల్లె వాసులు. పల్లెవాసులు ఆనందంతో వేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. మంత్రి కేటీఆర్ సహా చాలా మంది బీఆర్‌ఎస్ నాయకులు దీన్ని రీట్వీట్ చేస్తున్నారు.
పెద్ద ఎత్తున ఉత్సవాలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ అవతరణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన లోగోను నేడు (మే 22) ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులతో కలిసి సీఎం కేసీఆర్ ఈ లోగోను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో లోగోను రూపొందించారు. నీటి పారుదల ప్రాజెక్ట్ లు, మిషన్ భగీరథ, వ్యవసాయానికి ఫ్రీ కరెంటు, రైతుబంధు, కొత్త సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం, అమరుల స్మారక జ్యోతి, యాదాద్రి ఆలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, టీ హబ్, పాలపిట్ట, బోనాలు, బతుకమ్మ లాంటివాటికి లోగోలో స్థానం కల్పించారు.
Also Read: సర్కార్ తో చర్చలు సక్సెస్, సమ్మె నిర్ణయాన్ని విరమించిన రేషన్ డీలర్లు - వారం రోజుల్లో జీవో
Also Read:హైదరాబాద్ లో రోడ్ల తవ్వకాలపై జీహెచ్ఎంసీ నిషేధం, త్వరలోనే అమల్లోకి!