BRS MLC Kavitha: హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఆ పార్టీకి చెందిన జగిత్యాల కౌన్సిలర్లు భేటీ అయ్యారు. హైదరాబాద్ కు వచ్చిన జగిత్యాల బీఆర్ఎస్ కౌన్సిలర్లు మంగళవారం నాడు కవితో భేటీ అయ్యి పలు విషయాలు చర్చించారు. వైస్ చైర్మన్ పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టడంతో.. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ నేతృత్వంలో కౌన్సిలర్లు ఎమ్మెల్సీ కవితతో కీలక విషయాలపై చర్చలు జరిపారు. కవితతో మంతనాలు జరిపిన తరువాత వైస్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానంపై జగిత్యాల బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెనక్కి తగ్గారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.... బీఆర్ఎస్ పార్టీ అందరికీ అవకాశాలు ఇచ్చిందని, భవిష్యత్తులోనూ సమానావకాశాలు కల్పిస్తుందని చెప్పారు. రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతమై ప్రజల ఆశీర్వాదాన్ని సంపాదిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలపై గట్టిగా పోరాటం చేయవలసిన ఈ సమయంలో పార్టీ శ్రేణులు అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కనుక వైస్ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానంపై పునరాలోచన చేయాలని జగిత్యాల కౌన్సిలర్లుకు ఆమె సూచించారు. దాంతో ఎమ్మెల్సీ కవిత సూచనల మేరకు అవిశ్వాస తీర్మానంపై పార్టీ కౌన్సిలర్లు వెనక్కి తగ్గుతూ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నాడు జరగనున్న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ లో పాల్గొనబోమని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రకటించారు.