ఆర్థిక మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... మంత్రి హరీష్  తనపై, బీజేపీ ప్రభుత్వంపై అబద్దపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు ఆదాయం  ఎంత, ఖర్చు ఎంత, ఇప్పుడు ఎంతో మంత్రి చెప్పగలరా అని ప్రశ్నించారు. అబద్దపు ప్రచారంతో హరీష్ రావు స్థాయిని దిగజార్చుకుంటున్నారని అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 57 వేల పింఛన్లు ఇవ్వడం అబద్దం అని అన్నారు. నియోజకవర్గంలో మొత్తం ఇళ్లే 50 వేలు ఉంటే.. మరి 57వేల మందికి పింఛన్ ఎలా ఇస్తున్నారని ఎమ్మెల్యే నిలదీశారు. ఎమ్మెల్యే రిబ్బన్ కత్తిరించేందుకు తిరుగుతున్నారని మంత్రి హరీష్ రావు అనడం నిజంగా బాధగా ఉందని కాస్త ఎమోషనల్ అయ్యారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే కాకుండా ఎవరు కత్తిరిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. 


ఓడిస్తే అభివృద్ధి ఆపడం ఎక్కడి సంస్కృతో..


మొన్ననే దుబ్బాక ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టింది గుర్తు లేదా అని వ్యాఖ్యలు చేశారు రఘునందన్‌రావు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలవకపోతే.. దుబ్బాక అభివృద్ధి ఆపడం ఎంత వరకు సమంజసమని, ఇది ఎక్కడి సంస్కృతి అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మూడు సంవత్సరాల నుంచి కేసీఆర్ స్కూల్ అట్లే ఉంటుందని.. చేతనైతే సీఎంతో ప్రారంభించాలన్నారు. దమ్ముంటే తెలంగాణలో మూడోసారి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ప్రజలు కట్టిన పన్నుతోనే సంక్షేమ పథకాలు ఇచ్చే టీఆర్ఎస్ ప్రభుత్వం.. వారి ఇంట్లో నుంచి ఇచ్చినట్లుగా గొప్పలు చెప్పడం ఎందుకు అని విమర్శించారు. 


టీఆర్ఎస్ ప్రభుత్వంపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు..


అరాచక పాలన అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే విధంగా ప్రజలు మనుగోడులో తీర్పు ఇస్తారని మనుగోడు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.. ఉదయం తిరుమల స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం బయటకు వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు శ్రీవారి ఆశీస్సులు పొందటం సంతోషంగా ఉందని అన్నారు. ఎంతో మంది త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు. ఓ కుటుంబం చేతిలోకి వెళ్లడంతో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు అవుతుందని ఆరోపించారు. 


రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు.. 


తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని రెండు  సార్లు అధికారం చేపట్టారని, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారని, అడుగడుగునా ఉద్యమకారులను అవమానిస్తునే ఉన్నారని ఆరోపించారు రాజగోపాల్‌రెడ్డి. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగజార్చారని ఆయన చెప్పారు. అరాచక పాలన అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే విధంగా ప్రజలు మునుగోడులో తీర్పు ఇస్తారని ఆశిస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ని ఆరోపణలు చేసినా ఒక్క వ్యక్తి కోసం వచ్చిన ఎన్నికలు కావని, తెలంగాణ భవిషత్తు కోసం వచ్చిన ఎన్నికలని, ప్రలోభాలకు గురి చేసి ప్రతిపక్షాన్ని కొనుగోలు చేసి ప్రతిపక్షం లేకుండా సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రికి బుద్ది చెప్పేలా ప్రజలు తీర్పు ఇవ్వాలని, కుటుంబ రాక్షస పాలనా నుంచి తెలంగాణను కాపాడాలని ఆయన కోరారు. మునుగోడు ప్రజల తీర్పు శిరసా వహిస్తానని, తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం తథ్యం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.