Maoists Murder: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కుర్నపల్లి గ్రామ పంచాయతీలో దారుణం జరిగింది. పోలీస్ ఇన్ ఫార్మర్ గా పని చేస్తున్నాడన్న అనుమానంతో గ్రామ ఉప సర్పంచిని మావోయిస్టులు అత్యంత దారుణంగా నరికి చంపారు. అయితే నిన్న అర్ధరాత్రి గ్రామానికి వచ్చిన నలుగురు మావోయిస్టులు.. గ్రామ ఉప సర్పంచి ఇర్ప రామారావు ఇంటికి చేరుకున్నారు. తమ వెంట రావాలంటూ రామారావును అడగ్గా అతను అందుకు ఒప్పుకోలేదు. దీంతో బలవతంగా అతడిని తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు తమ కుమారుడిని తీసుకెళ్లొద్దంటూ కాళ్లా వేళ్లా పడినా ఫలితం లేక పోయింది. 


గ్రామశివారులో రక్తంతో..
నిన్న అర్ధరాత్రి మావోయిస్టులతో వెళ్లిన ఉప సర్పంచి రామారావు ఈరోజు ఉదయం గ్రామ శివారులో శవంగా మారి కనిపించారు. రక్తపు మడుగుల్లో చనిపోయి ఉండటాన్ని గ్రామస్తులు గుర్తించారు. వెంటనే విషయాన్ని పోలీసులతో పాటు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతదేహంతో పాటు సీపీఐ (మావోయిస్టు) చెర్ల-శబరి ఏరియా కమిటీ పేరిట లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసపత్రికి తరలించారు.


ఆ లేఖలో ఏముందంటే..? 
పోలీస్ ఇన్ ఫార్మర్ గా పనిచేస్తున్నాడన్న కారణంగా ఉప సర్పంచి ఇర్ప రామారావుకు మరణ శిక్ష విధించినట్లు మావోయిస్టులు లేఖలో రాశారు. అలాగే పోలీసులు ఇచ్చే డబ్బుకు ఆశపడి ఎవరూ ఇన్ ఫార్మర్లుగా పని చేయవద్దని తెలిపారు. ఎవరు ఇలాంటి పని చేసినా వారికి కూడా రామారావుకు పట్టిన గతే పడుతుందని లేఖ ద్వారా వెల్లడించారు.