ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం అమలులోకి వస్తుందంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇటీవల విశాఖలో ప్రకటించారు. డెడ్ లైన్ కూడా లేదన్నట్టు.. తక్షణం అమలులోకి వస్తుందని మూడు రోజుల కిందట బహిరంగ వేదికపై చెప్పేశారు. అప్పటినుంచి ఫ్లెక్సీలు, బ్యానర్ల వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. మా కడుపులు కొడతారా, మా వ్యాపారులు మూసేసుకోవాలా అంటూ వారు నిరసనలకు దిగారు. ఓవైపు ఈ ఇష్యూ ఇంత సీరియస్ గా జరుగుతుంటే, మరోవైపు ప్లాస్టిక్ బ్యాన్ ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కి ముడిపెడుతూ మరో సెటైరికల్ ప్రచారం మొదలైంది.
పవన్ కి, ప్లాస్టిక్ కి సంబంధం ఏంటి..?
గతంలో పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమా సమయంలో ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లను అనూహ్యంగా తగ్గించింది. అప్పట్లో ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారని, వారికి తక్కువ ధరకే వినోదం అందించాలంటే టికెట్ రేట్లు తగ్గించాలని చెప్పింది ప్రభుత్వం. అంతే కాదు, టికెట్ రేట్లు పెంచి అమ్ముతున్నారేమోనని చెక్ చేసేందుకు థియేటర్ల దగ్గర ఎమ్మార్వోలు, వీఆర్వోలు కూడా డ్యూటీలు చేశారు. కట్ చేస్తే.. భీమ్లా నాయక్ సినిమా తర్వాత టికెట్ రేట్ల గురించి పట్టించుకునేవారే లేరు, ఆ తర్వాత ఇండస్ట్రీ కోరిందని, టికెట్ రేట్లను యథాస్థానానికి చేర్చింది ప్రభుత్వం. బెనిఫిట్ షో ల విషయంలో కూడా ఉదారంగా ఉంది. అంటే కేవలం పవన్ కల్యాణ్ ని ఇబ్బంది పెట్టేందుకే ఆ నిర్ణయం తీసుకున్నారనే అపవాదు మూటగట్టుకుంది.
సరిగ్గా ఇప్పుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధాన్ని తెరపైకి తెచ్చారనే విమర్శలు వినపడుతున్నాయి. మరీ సిల్లీగా అనిపించినా.. దీన్ని జనసైనికులు హైలెట్ చేస్తున్నారు, వైసీపీపై విరుచుకుపడుతున్నారు. కావాలంటే చూడండి పవన్ కల్యాణ్ పుట్టినరోజు అయిపోగానే ఫ్లెక్సీ పరిశ్రమ కార్మికుల ఇబ్బందులు చూడలేక బ్యాన్ ఎత్తేస్తామంటూ ప్రభుత్వం ప్రకటిస్తుందని అంటున్నారు. పవన్ సినిమాలు రిలీజ్ అయితే టికెట్ల ధరలు తగ్గిస్తారు, పవన్ పుట్టినరోజు వస్తుందని ఫ్లెక్సీలు బ్యాన్ అంటున్నారని జనసైనికులు వాట్సప్ స్టేటస్ లు మారుమోగుతున్నాయి. పవన్ కల్యాణ్ పుట్టినరోజున బ్యానర్లు కట్టకుండా ఉండేందుకే సీఎం జగన్ ప్లాస్టిక్ బ్యానర్లపై నిషేధం విధించారని జోకులు పేలుస్తున్నారు జన సైనికులు.
విచిత్రంగా టీడీపీ నేతలు కూడా జనసైనికులకు సపోర్ట్ వచ్చారు. ఏపీలో పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు పూర్తవగానే ఫ్లెక్సీలపై ఉన్న నిషేధాన్ని సీఎం జగన్ ఎత్తేస్తారంటూ వెటకారంటా ట్వీట్లు పెట్టారు టీడీపీ మహిళా నాయకురాలు వంగలపూడి అనిత. ఏపీలో ప్లాస్టిక్ కంటే ముందు జగన్ ని బ్యాన్ చేయాలని అన్నారామె.
సరిగ్గా ప్లాస్టిక్ బ్యానర్ల నిషేధంపై పవన్ కల్యాణ్ కూడా విరుచుకుపడటం మరో విశేషం. ప్లాస్టిక్ నిషేధంపై ఇప్పటికిప్పుడు సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడాన్నితప్పుబట్టారు పవన్ కల్యాణ్. అకస్మాత్తుగా పర్యావరణంపై జగన్ కి ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందోనంటూ ఎద్దేవా చేశారు పవన్. తన ట్విట్టర్ అకౌంట్లో వరుస ట్వీట్లు పెట్టారు. ముందు విశాఖ పరిశ్రమల కాలుష్య భూతాన్ని పారద్రోలాలని, ఆ తర్వాత ప్లాస్టిక్ సంగతి చూడొచ్చంటూ మండిపడ్డారు. విశాఖలో రుషికొండ కరిగిపోతోందని, పర్యావరణంపై ప్రేమ ఉంటే, ముందు ఆ సంగతి చూడాలని జగన్ కి సలహా ఇచ్చారు.
మొత్తమ్మీద ఏపీలో ప్లాస్టిక్ బ్యానర్ల నిషేధం వ్యవహారానికి, పవన్ కల్యాణ్ పుట్టినరోజుకి ముడిపెడుతూ పలు రకాల కథనాలు వెలువడుతున్నాయి. బ్యానర్ల నిషేధం కేవలం పవన్ పుట్టినరోజు వరకు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత నిషేదం ఎత్తివేస్తారని అంటున్నారు జనసైనికులు. ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ, ప్లాస్టిక్ బ్యానర్ల నిషేధంపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గితే మాత్రం కచ్చితంగా జనసేన వాదన గెలిచినట్టే.