Harish Rao: మూడు గంటలు విద్యుత్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలో, మూడు పంటలకు 24 గంటలూ ఉచితంగా కరెంటిచ్చే బీఆర్ఎస్ సర్కారు కావాలో ప్రజలే తేల్చుకోవాలని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట గ్రామీణ మండలం రాఘవాపూర్‌లో "24 గంటల కరెంట్‌ - కాంగ్రెస్‌ పార్టీ ప్రకటన"లపై నిర్వహించిన రైతు సభలో మంత్రి పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో ట్రాన్స్‌ఫార్మర్లు పేలడం, మోటార్లు కాలిపోవడం పెద్ద ఎత్తున జరిగాయని గుర్తు చేశారు. 3 గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ నేతలు చెప్పడం చూస్తుంటే వారికి వ్యవసాయంపై ఉన్న అవగాహం అర్థం అవుతోందంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్న విషయాన్ని ప్రజలంతా గుర్తించాలని.. అలాగే కాంగ్రెస్ 3 గంటలే ఇస్తామని చెబుతున్న వ్యాఖ్యలను కూడా గుర్తుపెట్టకోవాలని అన్నారు.


రైతుబంధు కింద ఇప్పటి వరకు 11 విడతల్లో మొత్తం 72 వేల కోట్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి హరీష్ రావు తెలిపారు. రైతులకు ఎలాంటి కష్టం రాకూడదని 24 గంటల ఉచిత కరెంట్ కోసం ఏటా 12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పెద్ద చెరువు నిండుకుండలా మారిందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో లక్షా 6 వేల 74 మంది రైతులకు రైతు బీమా కల్పించామని వెల్లడించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు వారసుడు అని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు బతుకుదెరువు కోసం పక్క రాష్ట్రాలకు వెళితే.. నేడు ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు వలస వెళ్లే స్థితికి తెలంగాణ చేరుకుందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. రైతు ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్క రైతు తమ భవిష్యత్తు గురించి ఆలోచించుకొని.. అభివృద్ధి కోసం మరోసారి సీఎం కేసీఆర్ ను గెలిపించుకోవాలని సూచించారు. 


కాంగ్రెస్ నేతలను కరెంటు తీగలు పట్టుకోమన్న మంత్రి


మొన్నటికి మొన్న కాంగ్రెస్ నేతలు నేరుగా వెళ్లి కరెంటు తీగల్ని పట్టుకుంటే.. రాష్ట్రంలో కరెంట్ వస్తుందో లేదో తెలుస్తుందని మంత్రి హరీష్ రావు కామెంట్లు చేశారు. గతంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉందో, మరోసారి అధికారంలోకి వస్తే పాత తరహా పాలన తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పకనే చెబుతున్నారని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ పై ఒక్కొక్కరూ ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 గంటలు సరిపోతుందని ఒకరు అంటే, 8 గంటలు చాలని మరొకరి చెబుతున్నారని వివరించారు. అలాగే బోరు బావుల వద్ద మీటర్ల పెడతామని మరొకరు మాట్లాడుతున్నారని తెలిపారు. ఇలాంటి మాటలు చెబుతూ కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటుందని.. రైతుల పట్ల హస్తం పట్ల కాంగ్రెస్ విధానం ఏంటో తెలిసిపోయిందన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతల తీరుపై మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బషీర్ బాగ్ కాల్పులకు సీఎం కేసీఆర్ కారణం అని అంటున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇంతకంటే పెద్ద జోక్ మరోటి ఉండదని.. తెలంగాణ ఉద్యమానికి దారి తీసిన కారణాలలో విద్యుత్ కూడా ఒకటి అని చెప్పారు.