Gangula Kamalakar: సీబీఐ విచారణపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. శ్రీనివాస్ అనే వ్యక్తిని సీబీఐ ఇటీవల అరెస్టు చేసిందని.. ఆయన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడని తెలిపారు. శ్రీనివాస్ పేరు విన్నానని, ఓసారి కలిశానని అన్నారు. అలాగే కాపు సంఘంలో తిరిగే వాడని, ధర్మేందర్ అనే వ్యక్తి చెప్తే కలిసేందుకు అతను ఉన్న చోటుకు వెళ్లి పరిచయం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మున్నూరు కాపు కులంలో ఐపీఎస్ కదా అని గర్వంగా ఫీల్ అయినట్లు మాత్రమే చెప్పానని, అతని భార్య కూడా ఐఏఎస్ అని చెప్పడంతో ఆమెను కూడా కలుస్తానని చెప్పానని వివరించారు. ఆ రోజు అతనితో దిగిన ఫోటోనే ప్రస్తుతం అధికారుల వద్ద మంత్రి గంగుల ఉందన్నారు. ఆ రోజు మరుసటి రోజు గంట సేపు మామూలుగా మాట్లాడామే తప్ప అంతకు మించి ఏమీ లేదని మంత్రి గంగుల కమలాకర్ వివరించారు. అందుకే మంత్రి కదా అని నన్ను కూడా విచారణకు పిలిచారని చెప్పుకొచ్చారు. నా ఫోటోలు కాల్ లిస్ట్ సీబీఐ అధికారుల దగ్గర ఉందని మంత్రి స్పష్టం చేశారు.
సీబీఐ అధికారులు నాతో 20 నిమిషాలు మాత్రమే మాట్లాడారు..
శ్రీనివాస్ తో పాటు తనను కూడా అన్ని ప్రశ్నలు అడిగారని.. అయితే తామిద్దరూ చెప్పింది ఒకటే ఇని అధికారులు గుర్తించినట్లు మంత్రి గంగుల పేర్కొన్నారు. మళ్లీ మళ్లీ పిలవడం బాగుండదని కాసేపు ఉండండి అంటే ఆగినట్లు వివరించారు. తనతో సీబీఐ అధికారులు కేవలం 20 నిమిషాలు మాత్రమే మాట్లాడారని, శ్రీనివాస్ తో తనకు ఉన్న పరిచయం గురించి మాత్రమే అడిగారని చెప్పారు. ఇప్పటి వరకు శ్రీనివాస్ తనకు ఏ పనీ చేసిపెట్టమని అడగలేదని, అలాగే తాను కూడా శ్రీనివాస్ ను ఎలాంటి పని చేసి పెట్టమని అడగలేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తన బావ అయిన ఎంపీ వద్ధి రాజు రవి చంద్రకి శ్రీనివాస్ పరిచయం అని, శ్రీనివాస్ ఇంట్లో పెళ్లికి తమ బావను సాయం చేయమని అడిగినట్లు తనకు తెలిసిందని చెప్పారు. 15 లక్షల రూపాయల ఇప్పించామని అదే విషయాన్ని అధికారులకు చెప్పినట్లు మంత్రి గంగుల స్పష్టం చేశారు. ఆ డబ్బులు శ్రీనివాస్ ఇప్పటికీ చెల్లించలేదని తెలిపారు.
శ్రీనివాస్.. సీబీఐ అని చెప్పి ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదు..
తనకు ఏదైనా పని ఉంటే నేరుగా అధికారులతో మాట్లాడతాం అని.. మధ్యవర్తులతో మాట్లాడాల్సి అవసరం అస్సలే లేదని తెలిపారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఎవరిని కలవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మమ్మల్ని ఎన్ని రకాల ప్రశ్నలు వేసినా నిజం ఇదేనని చెప్పుకొచ్చారు. శ్రీనివాస్ అనే వ్యక్తి ఏ రోజు ఎవరితో లావాదేవీలు జరపలేదు కాబట్టి మాకు ఎవరికి అనుమానం రాలేదన్నారు. అతను కులంలో కేవలం గొప్పలు చెప్పుకొని తిరిగాడని.. శ్రీనివాస్ అనే వ్యక్తి సీబీఐ అని చెప్పి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని ఇటీవల జరిగిన తాజా విచారణలో తేలిందన్నారు.