Mancherial News: మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి మొదలైంది. మలి దశ ఉద్యమకారుడు, మంచిర్యాల బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన ఆయన మంచిర్యాలపై దొరల పెత్తనం మొదలైందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఉద్యమకారులకు టికెట్లు ఇస్తేనే మంచిర్యాలలో బీఅర్ఎస్ పార్టీ కొనసాగుతుందని, లేని పక్షంలో పార్టీని మంచిర్యాలలో పూర్తిగా భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు.


ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మంచిర్యాలలోని పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరిందన్నారు. మాతా శిశు ఆసుపత్రిని గోదావరి పరివాహక ప్రాంతంలో ఊరి బయట కట్టడం ఏంటని ప్రశ్నించారు. దానికి పరిష్కారం చేయలేని వారు పరిపాలన ఎలా కొనసాగిస్తారన్నారు. వారం రోజుల్లో హైకమాండ్ ను కలిసి మంచిర్యాల అభ్యర్థిని మార్చాలని కోరుతామని తెలిపారు. అభ్యర్థిని అప్పటికీ మార్చని పక్షంలో తామే బీసీ సామాజిక వర్గానికి చెందిన దమ్మున్న వారిని మంచిర్యాలలో ఎమ్మెల్యే గా నిర్ణయించి అ ఎమ్మెల్యేనీ గెలిపించుకుంటామని సవాల్ చేశారు.


గడ్డం అరవింద రెడ్డి మాట్లాడుతూ.. "నాకు ఒకటే బాధ ఉంది. అదేంటంటే.. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గోదావరి నీళ్లు వస్తుండే. అందరూ తాగుతుండే. కానీ ఇప్పుడు వచ్చే నీళ్లు తాగుతున్నరా.. బట్టలు ఉతకడానికి కూడా పనికిరాకుండా వస్తున్నయి. ఇది నిజమా కాదా మీరే చెప్పండి. రోడ్ల మీద సర్కిళ్లు కడ్తరు. రోడ్ల మీదనే గోడలు కడ్తున్నరు. యాక్సిడెంట్లు అయినయ్. చనిపోతరు. ఆంధ్రాలో ఉన్నపుడు బాగున్నమా, ఇప్పుడు బాగున్నమా. వరదలు వస్తున్నయ్. మంచిర్యాల మునుగుతున్నది. మంచిర్యాల మునిగే అవసరమే లేదు. తెలివితోని పని చేస్తే మంచిర్యాలలో కొంచెం భూమి కూడా వరదలకు తడవదు. తెలంగాణ వచ్చినంక మనం ఏదైతే డెవలప్ మెంట్ ఊహించినమో అదేదీ జరగలేదు. నేను ఒకటి స్పష్టంగా అడుగుత. ఈ నియోజక వర్గంలో మూడు పార్టీలు ఉన్నయ్. ఒకటే సామాజిక వర్గానికి ఎందుకు మూడు పార్టీలు చేస్తున్నరు. ఇక్కడ బీఆర్ఎస్ వ్యక్తికి ఇచ్చిన సీటు మార్చకపోతే ఇక్కడ బీఆర్ఎస్ కు స్థానమే ఉండదు. సర్వే చేపిస్తరు. 20 పర్సెంటోళ్లకు టికెట్ ఇస్తరు, 50 పర్సంట్ వాళ్లకు టికెట్ ఇవ్వరు. నేనేం చేయాలే. మీ ఉద్దేశం ఏంది" అని ప్రశ్నించారు.